SriLanka Cricket: వాటర్ బాటిల్ కోసం గొడవ.. క్రికెటర్ దాడిలో కోచ్ మృతి
SriLanka Cricket: శ్రీలంక క్రికెట్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాగునీటి వివాదంలో యువ ఆటగాడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సీనియర్ క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Sumith Fernando
SriLanka Cricket: కొలంబోలోని ఒక ప్రముఖ క్రికెట్ శిక్షణ కేంద్రంలో చోటుచేసుకున్న చిన్న వివాదం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. ఆగస్టు 8న ప్రాక్టీస్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లగా అక్కడి కొళాయిల్లో నీళ్లు రాకపోవడంతో క్రీడా మైదాన సిబ్బందితో ఘర్షణకు దిగారు. వాతావరణం వేడెక్కుతుండటం గమనించిన 62 ఏళ్ల సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో వెంటనే రంగంలోకి దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి గొడవను సర్దుమణిగేలా చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో ఓ ఆటగాడు ఆవేశంతో విచక్షణ కోల్పోయి దాడికి తెగబడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
మైదానంలో జరిగిన ఈ భౌతిక దాడిలో 17 ఏళ్ల స్కూల్ క్రికెటర్ సుమిత్ ఫెర్నాండోపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి కిందపడిపోయిన కోచ్‌ను తోటివారు వెంటనే కొలంబో నేషనల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి క్షీణించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు. మైనర్ కావడంతో నిందితుడిని కొలంబో కోర్టులో హాజరుపరిచి చైల్డ్ ప్రొబేషన్ కస్టడీకి పంపారు. నిందితుడి కస్టడీని ఆగస్టు 17 వరకు పొడిగించి విచారణ వేగవంతం చేశారు.
కుశాల్ మెండిస్ మెంటార్‌గా సుమిత్ ఫెర్నాండో సేవలు
మరణించిన సుమిత్ ఫెర్నాండో శ్రీలంక క్రికెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో కోచ్‌గా పనిచేస్తూ ఎంతోమంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దారు. ప్రస్తుతం శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కుశాల్ మెండిస్ స్కూల్ రోజుల్లో ఈయన శిక్షణలోనే రూపుదిద్దుకోవడం విశేషం. ఆటగాళ్లను తయారు చేయడమే కాకుండా బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్లో పిచ్ క్యూరేటర్‌గా కూడా ఆయన సేవలు అందించారు. ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు ఇలా చిన్న గొడవలో ప్రాణాలు కోల్పోవడం శ్రీలంక క్రీడా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.




