Stephen Fleming-CSK: సీఎస్‌కేకు స్టీఫెన్ ఫ్లెమింగ్‌ గుడ్‌బై.. విడిపోవడానికి కారణాలు ఇవేనా?

Stephen Fleming ended his 18-year association with CSK. సీఎస్‌కేతో ఉన్న 18 ఏళ్ల బంధానికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ గుడ్‌బై చెప్పాడు.

Rishvik
Published on: 13 July 2026 5:58 PM IST
Stephen Fleming-CSK
X

Stephen Fleming-CSK: సీఎస్‌కేకు స్టీఫెన్ ఫ్లెమింగ్‌ గుడ్‌బై.. విడిపోవడానికి కారణాలు ఇవేనా?

Stephen Fleming-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, సుదీర్ఘమైన కోచ్-ఫ్రాంచైజీ భాగస్వామ్యానికి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో ఉన్న 18 ఏళ్ల బంధానికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

54 ఏళ్ల స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చెన్నై సూపర్ కింగ్స్‌తో 2008 ఐపీఎల్ తొలి సీజన్ నుంచే అనుబంధం ఉంది. మొదటి ఎడిషన్‌లో అతడు సీఎస్‌కే తరఫున ప్లేయర్‌గా బరిలోకి దిగారు. ఆ తర్వాత రెండో సీజన్ (2009) నుంచి సీఎస్‌కే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు ఫ్లెమింగ్‌ చెన్నై జట్టులో కోచ్‌గా కొనసాగడం విశేషం. మొత్తంగా 18 ఏళ్ల పాటు ఫ్లెమింగ్‌-సీఎస్‌కే అనుబంధం కొనసాగింది. చివరకు ఆ బంధానికి బీటలు వారింది.

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్.. ఐపీఎల్ లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌గా నిలిచింది. వీరిద్దరి నేతృత్వంలో సీఎస్‌కే అద్భుత విజయాలను అందుకుంది. సీఎస్‌కే ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో చెన్నై విజేతగా నిలిచింది. ఈ ఇద్దరి కాంబోలో గ్లోబల్ వేదికపై కూడా చెన్నై సత్తా చాటింది. 2 సార్లు ఛాంపియన్స్‌ లీగ్ విజేతగా నిలిచింది. ఐపీఎల్‌లో సీఎస్‌కే రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది.

గత ఆరు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ.. మిగిలిన నాలుగు ఎడిషన్లలో మాత్రం లీగ్ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. మరీ ముఖ్యంగా గత మూడు సీజన్లలో జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక, కొత్త సారథి రుతురాజ్ గైక్వాడ్‌కు మార్గనిర్దేశం చేయడంలో ఫ్లెమింగ్‌ కొంత ఇబ్బంది పడ్డాడనే టాక్ నడుస్తోంది. ఈ వరుస పరాజయాల వల్లే యాజమాన్యం ఆయనను పక్కన పెట్టి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాబోయే సీజన్‌లో ధోనీ చెన్నై జట్టుకు 'మెంటార్‌'గా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీ మెంటార్‌గా వస్తుండటంతో.. జట్టుకు ప్రత్యేకంగా ప్రధాన కోచ్ అవసరం లేదనే భావనతోనే ఫ్లెమింగ్‌ను తప్పించారనే చర్చ కూడా సాగుతోంది. కారణాలు ఏవైనప్పటికీ.. ఐపీఎల్‌లో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందనే చెప్పాలి.

స్టీఫెన్ ఫ్లెమింగ్‌ గుడ్‌బైపై సీఎస్‌కే ఓ ప్రకటన విడుదల చేసింది. 'స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన, సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కొనసాగించాం. పరస్పర గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్లెమింగ్, చెన్నై యాజమాన్యం మధ్య జరిగిన పలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు' అని సీఎస్‌కే పేర్కొంది. 'ఈ ఫ్రాంచైజీ ప్రయాణంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు మా కోచింగ్ విభాగంలో ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించాడు. మా జట్టు గుర్తింపు, విజన్, విజయ సంస్కృతిని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమూల్యం. ఆయన అంకితభావం, నాయకత్వం, కృషికి సీఎస్‌కే కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మైదానంలో మా ప్రయాణం ముగిసింది. సీఎస్‌కే చరిత్రలో ఫ్లెమింగ్‌ ఎప్పటికీ అంతర్భాగంగానే ఉంటారు' అని సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ అన్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story