Sunil Gavaskar: మా వల్లే మీరు బతికేది.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!
Sunil Gavaskar Is Angry. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Sunil Gavaskar
Sunil Gavaskar: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం పిచ్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో సన్నీ స్పందించారు. భారత పిచ్‌లపై తరచూ విమర్శలు చేసే విదేశీ మాజీ క్రికెటర్లు, నిపుణులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. భారత క్రికెట్ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదన్నారు. భారత క్రికెట్ వల్లే అనేక దేశాల బోర్డులు భారీ ఆదాయాన్ని పొందుతున్నాయని, ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని గవాస్కర్ హెచ్చరించారు.
లార్డ్స్ పిచ్‌కు ఐసీసీ డీమెరిట్ పాయింట్:
ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో మొదటి రెండు రోజుల్లోనే 33 వికెట్లు పడ్డాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. లార్డ్స్ స్టేడియం చరిత్రలో తొలిసారిగా డీమెరిట్ పాయింట్ రావడం విశేషం. ఈ అంశాన్ని ప్రస్తావించిన సునీల్ గవాస్కర్.. భారత పిచ్‌లపై విమర్శలు చేసే వారు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మిడ్-డే పత్రికలో తన కాలమ్‌లో గవాస్కర్ విదేశీ క్రికెట్ వర్గాలపై, ముఖ్యంగా భారత క్రికెట్ అండ్ బీసీసీఐపై విమర్శలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత పిచ్‌లపై మాత్రమే ఎందుకు విమర్శలు?:
'లార్డ్స్‌లో తొలి రెండు రోజుల్లోనే 33 వికెట్లు పడిపోయాయి. భారత పిచ్‌లను విమర్శిస్తూ కెరీర్‌లు నిర్మించుకున్న వారు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇంగ్లండ్‌లో బంతి ఎక్కువగా తిరిగితే అది బ్యాటర్ల తప్పు అంటారు. ఆస్ట్రేలియాలో బౌన్స్ ఎక్కువగా ఉంటే టెక్నిక్ లోపమని చెబుతారు. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్ తిరిగితే మాత్రం దాన్ని 'డస్ట్ బౌల్' అని విమర్శిస్తారు. భారత పిచ్‌ల విషయంలో మాత్రమే ద్వంద్వ వైఖరి చూపుతున్నారు' అని గవాస్కర్ మండిపడ్డారు.
నిపుణుల ముసుగులో కపటులు:
విదేశీ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులపై గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'భారత్‌లో స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ కనిపిస్తే టెక్నిక్ గురించి మాట్లాడరు. వెంటనే పిచ్‌ను తప్పుపడతారు. అదే ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో అయితే బ్యాటర్ల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తారు. ఇలాంటి వారు నిపుణుల ముసుగులో ఉన్న కపటులు' అని గవాస్కర్ ఫైర్ అయ్యారు.
బీసీసీఐ వల్లే ఇతర బోర్డులకు ఆదాయం
బీసీసీఐపై తరచూ విమర్శలు చేసే క్రికెట్ బోర్డులకు కూడా గవాస్కర్ కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో భారత క్రికెట్, భారత అభిమానుల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు. 'బీసీసీఐని విమర్శించడం చాలా మందికి అలవాటైంది. కానీ ఆదాయం విషయానికి వస్తే అందరూ భారత్ వైపే చూస్తారు. భారత క్రికెట్, భారత అభిమానుల వల్లే ఇతర బోర్డుల ఖజానాలు నిండుతున్నాయి' అని స్పష్టం చేశారు.
ఐపీఎల్‌పై ఫిర్యాదులు ఎందుకు?:
ఐపీఎల్ కారణంగా తమ ఆటగాళ్లు జాతీయ జట్లకు అందుబాటులో ఉండరని విదేశీ బోర్డులు తరచూ విమర్శిస్తాయని గవాస్కర్ గుర్తు చేశారు. అయితే ఐపీఎల్ ద్వారా ఆ బోర్డులు పొందుతున్న ఆర్థిక లాభాల గురించి ఎవరూ మాట్లాడరన్నారు. 'ఐపీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాళ్ల ఫీజులో 10 శాతం వారి బోర్డులకు వెళ్తుంది. ప్రతి ఏడాది ఇది లక్షల పౌండ్ల ఆదాయం. మరి ది హండ్రెడ్ లేదా బిగ్ బాష్ లీగ్ తమ విదేశీ ఆటగాళ్ల బోర్డులకు ఇలాంటి వాటా ఇస్తాయా?.. అసలు ఇవ్వవు. కానీ విమర్శలు మాత్రం ఐపీఎల్, బీసీసీఐపైనే' అని గవాస్కర్ తెలిపారు.
భారత క్రికెట్‌ను ఎవరూ ఆపలేరు:
భారత క్రికెట్ స్థాయిని తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. 'కాఫీ వాసన చూసి వాస్తవాన్ని అంగీకరించండి. భారత క్రికెట్ ఇక్కడే ఉంటుంది. దాన్ని ఎవరూ కిందకు లాగలేరు' అంటూ సన్నీ ఇతర బోర్డులను ఉద్దేశించి మాట్లాడారు. లార్డ్స్ పిచ్ వివాదం, బీసీసీఐపై విమర్శలు, ఐపీఎల్ ఆర్థిక ప్రభావం వంటి అంశాలపై గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.




