ధోనీ కాదు.. రైనా రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే..!
Suresh Raina Retirement: భారత మాజీ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు పలకడానికి అసలు కారణాన్ని వెల్లడించాడు.
ధోనీ కాదు.. రైనా రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే..!
Suresh Raina Retirement: భారత మాజీ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు పలకడానికి అసలు కారణాన్ని వెల్లడించాడు. 2020 ఆగస్టు 15న ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. ధోనీ నిర్ణయమే రైనా రిటైర్మెంట్‌కు కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని రైనా తాజాగా స్పష్టం చేశాడు.
ధోనీ రిటైర్మెంట్ కారణం కాదు..
ఆకాశ్ చోప్రాతో జరిగిన ‘Baith and Bol’ కార్యక్రమంలో రైనా తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోనీతో కలిసి ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక వేరే కారణం ఉందన్న ప్రచారానికి తెరదించాడు.
రైనా తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న సమయంలోనే అతని తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని రైనా భావించాడు. అదే సమయంలో క్రికెట్ నుంచి తప్పుకుని కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు.
‘అమ్మను చూసుకోవాలనుకున్నా’..
“నా తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మా అమ్మకు నాన్నతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మరణించిన తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుని అమ్మను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని నాకు అర్థమైంది” అని రైనా వెల్లడించాడు.
కుటుంబ పరిస్థితుల్లో తన భార్య అందించిన సహకారాన్ని కూడా రైనా గుర్తు చేసుకున్నాడు. పిల్లలను చూసుకోవడంలో ఆమె ఎంతో అండగా నిలిచిందని చెప్పాడు.
కుమార్తెతో సమయం గడపాలనుకున్న రైనా..
రిటైర్మెంట్ తర్వాత తన కుమార్తెతో గడిపిన సమయం తనకు ఎంతో విలువైనదని రైనా తెలిపాడు. ఆమెను స్కూల్‌కు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం, ఇంట్లో వంట చేయడం వంటి విషయాలను కూడా ప్రస్తావించాడు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నిర్ణయం విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని రైనా స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యంగా ఉండటం తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
భారత క్రికెట్‌లో రైనా ముద్ర..
2005లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన రైనా.. 2018లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున 226 వన్డేల్లో 5,615 పరుగులు, 78 టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. టెస్టు అరంగేట్రంలోనే శ్రీలంకపై సెంచరీ సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రైనా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక ఆటగాడిగా నిలిచిన రైనాను అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ ఐపీఎల్’ అని పిలిచేవారు. 2020లో ధోనీతో కలిసి రిటైర్మెంట్ ప్రకటించిన కారణంగా ఇద్దరి నిర్ణయాలను ఎప్పటి నుంచో కలిపి చూస్తున్న అభిమానులకు.. రైనా తాజా వ్యాఖ్యలు అసలు కథను తెలియజేశాయి.




