Suryakumar Yadav: అదంతా ఫేక్.. నేను టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఏమీ అనలేదు!

Suryakumar Yadav Denies Fake Statement. సూర్యకుమార్ యాదవ్ తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రకటనపై స్పందించాడు.

Rishvik
Updated on: 7 July 2026 5:55 PM IST
Suryakumar Yadav
X

Suryakumar Yadav: అదంతా ఫేక్.. నేను టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఏమీ అనలేదు!

Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ప్రకటనపై స్పందించాడు. తాను ఎలాంటి ప్రకటన చేయలేదని, టీమిండియా మేనేజ్‌మెంట్‌ను అస్సలు విమర్శించలేదని స్పష్టం చేశాడు. అభిమానులు ఇలాంటి ఫేక్ సమాచారాన్ని నమ్మవద్దని, షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన సూరీడు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక సందేశాన్ని పంపించాడు.

టీ20 జట్టులో చోటు కోల్పోయిన సూర్య:

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు ఆడలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటలనకు సూర్య ఎంపిక కాలేదు. అనంతరం బీసీసీఐ జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన మూడు మ్యాచ్‌ల టీ20 జట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా విఫలమవడంతో సెలెక్టర్లు సూర్యను పక్కన పెట్టి.. శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను సూర్య విమర్శించినట్లు ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సూరీడు క్లారిటీ ఇచ్చాడు.

భారత జట్టుకు శుభాకాంక్షలు:

సోషల్ మీడియా వేదికగా స్పందించిన సూర్యకుమార్.. 'భారత జట్టుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు తమ శక్తిమేరకు కష్టపడుతున్నారని నాకు తెలుసు. వారికి ఎప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుంది. భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అభినందనలు. వైభవ్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది. నీ ముందు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. దేశానికి మరింత గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను' అంటూ బుడ్డోడిని ప్రత్యేకంగా అభినందించాడు.

అదంతా ఫేక్:

'నా పేరుతో ఒక ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. అది నా వరకు వచ్చింది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటి ప్రకటనకు నేను అనుమతి కూడా ఇవ్వలేదు. దయచేసి ఆ సమాచారాన్ని నమ్మవద్దు, షేర్ చేయవద్దు' అని అభిమానులకు సూర్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెట్‌పై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. 'భారత క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, ఆటకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నా గురించి తప్పుడు ప్రచారం చేసే మాటల కంటే నా చర్యలే బలంగా మాట్లాడతాయి' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సూర్యకుమార్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story