Tanzid Tamim: తంజిద్ తమీమ్ సంచలన సెంచరీ.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే ఆగష్టు 14 ప్రత్యేకమైన రోజు!

Tanzid Tamim History. బంగ్లాదేశ్ ఓపెన‌ర్ తంజిద్ హస‌న్ త‌మీమ్ చ‌రిత్ర సృష్టించాడు. తొలి బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

Rishvik
Published on: 14 Aug 2026 5:46 PM IST
Tanzid Tamim
X

Tanzid Tamim: తంజిద్ తమీమ్ సంచలన సెంచరీ.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనే ఆగష్టు 14 ప్రత్యేకమైన రోజు!

Tanzid Tamim: బంగ్లాదేశ్ ఓపెన‌ర్ తంజిద్ హస‌న్ త‌మీమ్ చ‌రిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సెంచ‌రీ చేసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా తంజిద్ రికార్డుల్లో నిలిచాడు. ఆస్ట్రేలియాతో డార్విన్‌లోని మార్రా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో శతకం బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది.

తంజిద్ 197 బంతుల్లో 101 ప‌రుగులు చేశాడు. తన కెరీర్‌లో రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న 25 ఏళ్ల తంజిద్.. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఈ ఘనత సాధించాడు. అంత‌కుముందు కంగారో గ‌డ్డ‌పై టెస్టుల్లో హ‌స‌న్ స‌ర్కార్ చేసిన 76 ప‌రుగులే అత్యధిక స్కోరుగా ఉంది. తాజాగా ఆ రికార్డును తంజిద్ బ్రేక్ చేశాడు.

ఓవ‌రాల్‌గా విదేశాల్లో సెంచ‌రీ సాధించిన రెండో బంగ్లా బ్యాట‌ర్‌గా తంజిద్ త‌మీమ్ నిలిచాడు. 2022లో మ‌హ్మ‌దుల్ హ‌స‌న్ డ‌ర్బ‌న్ వేదిక‌గా దక్షిణాఫ్రికాపై 137 ప‌రుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియాపై సెంచ‌రీ చేసిన రెండో బంగ్లాదేశ్ క్రికెట‌ర్‌గా తంజిద్ మ‌రో రికార్డు నెలకొల్పాడు.

2006లో ఢాకాలోని ఫతుల్లా మైదానంలో షాహ్‌రియ‌ర్ న‌ఫీ 138 ప‌రుగులు చేశాడు. అంతేకాదు తంజిద్ త‌న కెరీర్‌లో డెబ్యూ సెంచ‌రీ కూడా ఇదే. తంజిద్ అద్భుత సెంచరీతో ఆసీస్ గడ్డపై చెలరేగడంతో.. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో 2026 ఆగస్టు 14 ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 198 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ చేసింది. రెండో రోజు తంజిద్ త‌మీమ్, మొమినుల్ హక్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. 96/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఈ జోడీ.. తొలి గంటలో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ.. మిగతా సమయంలో సింగిల్స్‌తో స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించారు.

ఈ క్రమంలో తంజిద్ తన అర్ధ సెంచరీని 102 బంతుల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా ఏమాత్రం తొందరపడకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. మరోవైపు మొమినుల్ కూడా అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. అయితే 49 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తంజిద్‌తో కలిసి మొమినుల్ 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

మొమినుల్ ఔటైన తర్వాత కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో క్రీజులోకి వచ్చాడు. వచ్చిరాగానే అతడు ధాటిగా ఆడాడు. మరోవైపు తంజిద్ మాత్రం తన సెంచరీ దిశగా సాగాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో తంజిద్‌కు 62 పరుగుల వద్ద లైఫ్ దక్కింది. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తంజిద్.. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు.

రెండో సెషన్‌లో లియాన్ బౌలింగ్‌లో మిడ్‌ఆఫ్ వైపు బంతిని నెట్టి తన కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. 188 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకోగా.. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. తంజిద్ సెంచరీ పూర్తి చేయడంతో బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మిన్నంటాయి. అయితే సెంచరీ పూర్తి చేసిన కొద్దిసేపటికే తంజిద్ ఔటయ్యాడు. ఈ సెంచరీతో తంజిద్ తన వ్యక్తిగత రికార్డుతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలోనూ తన పేరును లిఖించుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా నిలవడం అతడి కెరీర్‌లోనే అతిపెద్ద మైలురాళ్లలో ఒకటిగా నిలిచిపోనుంది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 6 వికెట్లకు 351 రన్స్ చేసింది. బంగ్లా 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story