Team India Players: చిక్కుల్లో ఇద్దరు టీమిండియా స్టార్లు.. నాడా నోటీసులు.. ఏడు రోజుల గడువు మాత్రమే!

Yashasvi Jaiswal receive NADA notices. భారత క్రికెట్‌లో మరోసారి డోపింగ్ నిబంధనల అంశం చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 9 May 2026 5:38 PM IST
Team India Players
X

Team India Players

Team India Players: భారత క్రికెట్‌లో మరోసారి డోపింగ్ నిబంధనల అంశం చర్చనీయాంశంగా మారింది. టీమిండియా యువ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మహిళల జట్టు స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డోప్ టెస్టింగ్‌కు సంబంధించి ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ)లో భాగంగా ఉన్నారు. వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్ అంటే.. ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటారో ముందుగానే నాడా అధికారులకు తెలియజేయాలి. అలా తెలియజేయకపోవడం లేదా చెప్పిన చోట అందుబాటులో లేకపోవడాన్ని వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్ అంటారు.

ఆర్‌టీపీ జాబితాలో ఉన్న ఆటగాళ్లు తమ ప్రస్తుత లొకేషన్‌తో పాటు ప్రతిరోజూ ఒక గంట సమయాన్ని డోప్ టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంటామని ముందుగానే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే నివేదికల ప్రకారం.. 2025 నవంబర్ 7న డోప్ కంట్రోల్ అధికారులు షెఫాలీ వర్మ వద్దకు శాంపిల్ సేకరణ కోసం వెళ్లినప్పుడు ఆమె అందుబాటులో లేరు. అలాగే 2025 డిసెంబర్ 17న యశస్వి జైస్వాల్ కూడా తాను పేర్కొన్న లొకేషన్‌లో లేడట. ఈ ఘటనలపై 2026 ఫిబ్రవరిలో నాడా వివరణ కోరినప్పటికీ.. ఇద్దరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దాంతో అధికారికంగా వీరిద్దరిపై మిస్డ్ టెస్ట్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కూడా నాడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తుది వివరణ ఇవ్వడానికి జైస్వాల్‌, షెఫాలీకి మరో ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది.

డోపింగ్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు 12 నెలల వ్యవధిలో మూడు సార్లు వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్ చేసినట్లయితే అది యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఆ తర్వాత సరైన వివరణ ఇవ్వలేకపోతే.. రెండేళ్ల వరకు సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ప్రస్తుతం యశస్వి జైస్వాల్‌, షెఫాలీ వర్మకి ఇది తొలి తప్పిదం. అయినప్పటికీ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా అప్రమత్తమైంది. 'నాడా నుంచి మాకు సమాచారం వచ్చింది. ఇది ఎలా జరిగిందో తెలుసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు సమాచారం.

2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంతో యాంటీ డోపింగ్ నిబంధనల అమలుపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహా ఘటనలో 2019లో భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకు నాడా ఎనిమిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దగ్గు మందులో ఉన్న నిషేధిత పదార్థం టెర్బుటలైన్ కారణంగా అతడు డోప్ టెస్టులో విఫలమయ్యాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్‌, షెఫాలీ వర్మ వ్యవహారం కూడా భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి మరి ఈ ఇద్దరిపై నాడా ఏమైన చర్యలు తీసుకుంటుందో.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story