TG20 League: తెలంగాణ టీ20 లీగ్.. పాలమూరు స్ట్రైకర్స్‌లో శ్రీలంక దిగ్గజం!
TG20 League: Chaminda Vaas Joins Palamuru Strikers. శ్రీలంక దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ పాలమూరు స్ట్రైకర్స్ మెంటార్‌గా నియమితులయ్యాడు.
TG20 League: తెలంగాణ టీ20 లీగ్.. పాలమూరు స్ట్రైకర్స్‌లో శ్రీలంక దిగ్గజం!
TG20 League: తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ప్రతి జట్టు విజయాల కోసం చివరి వరకు పోరాడుతుండగా.. భారీ లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో జట్లు తమ బలాన్ని పెంచుకునే దిశగా ప్రాంఛైజీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాలమూరు స్ట్రైకర్స్ ఫ్రాంచైజీ కీలక అడుగు వేసింది. శ్రీలంక దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్‌ను జట్టు మెంటార్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది.
చమిందా వాస్‌ను జట్టు మెంటార్‌గా నియమిస్తూ పాలమూరు స్ట్రైకర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక క్రికెట్ లెజెండ్ చమిందా వాస్ మా జట్టుతో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకున్న అపారమైన అనుభవం, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం మా ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. మెంటార్‌గా వాస్ మార్గదర్శకత్వంలో జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని విశ్వసిస్తున్నాం' అని పేర్కొంది. శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన చమిందా వాస్ మా ప్రయాణంలో చేరారు అని టీజీ20 కూడా ప్రకటించింది.
చమిందా వాస్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన ఆయన.. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా, బౌలింగ్ కన్సల్టెంట్‌గా పలు జట్లతో పనిచేస్తూ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పుడు పాలమూరు స్ట్రైకర్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. జట్టుకు విలువైన సూచనలు అందించనున్నాడు. పాలమూరు స్ట్రైకర్స్ కోచింగ్ విభాగంలో ఇప్పటికే హెడ్ కోచ్‌గా బెన్ జాన్సన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు వాస్ చేరికతో జట్టు కోచింగ్ వ్యవస్థ మరింత బలపడింది. ముఖ్యంగా యువ బౌలర్లకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడనుంది.
ప్రస్తుతం టీజీ20 లీగ్ పాయింట్ల పట్టికలో పాలమూరు స్ట్రైకర్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. మరోవైపు హైదరాబాద్ ఛాంపియన్స్ వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నీ కీలక దశకు చేరుకున్న వేళ చమిందా వాస్ చేరిక పాలమూరు స్ట్రైకర్స్‌కు ఎంత మేరకు కలిసివస్తుందో చూడాలి. ఆయన మార్గదర్శకత్వంలో జట్టు పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.




