MS Dhoni: ధోనీ లేకుండా సీఎస్కే లేదు.. రిటైర్మెంట్‌పై యజమాని ఎమోషనల్ కామెంట్స్!
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే యజమానులు ఎన్. శ్రీనివాసన్, రూప శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
MS Dhoni: ధోనీ లేకుండా సీఎస్కే లేదు.. రిటైర్మెంట్‌పై యజమాని ఎమోషనల్ కామెంట్స్!
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యజమాని ఎన్. శ్రీనివాసన్ భావోద్వేగంగా స్పందించారు. ధోనీతో తమ అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిదని, ‘‘ధోనీ లేకుండా సీఎస్కే లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి ఎలా తెలియజేశారో సీఎస్కే యజమాని రూప శ్రీనివాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ధోనీతో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్. శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, పరాజయాల్లో మేమిద్దరం కలిసి ప్రయాణించాం. మా మధ్య బంధం ఇంత బలంగా ఉండటానికి కారణం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే. ఒకరి అభిప్రాయాలను మరొకరం ఎప్పుడూ గౌరవించుకునేవాళ్లం.’’
‘‘2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో ధోనీని జట్టులోకి తీసుకోవాలన్న నా నిర్ణయం నా జీవితంలోనే అత్యుత్తమమైనది. సీఎస్కేకు అతడు సాధించిన విజయాలే కాదు.. అతడి గొప్ప వ్యక్తిత్వం కూడా నన్నెంతో ఆకట్టుకుంది.’’ ‘‘మా అస్తిత్వంలో ధోనీ ఎప్పటికీ భాగమే. చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లప్పుడూ అతనికి సొంత ఇల్లే’’ అని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.
ఆటగాడిగా తాను రిటైర్ అవుతున్నట్లు ధోనీ శనివారం ఫ్రాంచైజీకి తెలియజేశారని రూప శ్రీనివాసన్ తెలిపారు. రిటెన్షన్, రిలీజ్ ఆటగాళ్లపై చర్చిస్తున్న సమయంలో ధోనీ ఆకస్మిక నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచినట్లు ఆమె వివరించారు. ‘‘శనివారం మేము మా జట్టు నుంచి రిలీజ్ చేసే ఆటగాళ్ల గురించి చర్చించడానికి ఫోన్ కాల్‌లో మాట్లాడుకున్నాం. అప్పుడు క్రికెట్‌కు సంబంధించి చాలా విషయాలు చర్చించాం. వచ్చే సీజన్ కోసం వ్యూహరచన చేస్తూ ఎవరిని ఎంచుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నాం. చివరగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ జట్టు నుంచి రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను చదువుతుండగా.. ధోనీ చాలా ప్రశాంతంగా ‘బహుశా నా పేరును కూడా అందులో చేర్చాలేమో’ అని అన్నారు’’ అంటూ ఆ క్షణాన్ని రూప శ్రీనివాసన్ వెల్లడించారు.




