Praful Hinge-SRH: ఇది కేవలం ఆరంభమే, ముందుది అసలు పండగ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Praful Hinge-SRH: ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

Rishvik
Published on: 23 April 2026 8:23 PM IST
Praful Hinge-SRH
X

Praful Hinge-SRH: ఇది కేవలం ఆరంభమే, ముందుది అసలు పండగ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Praful Hinge-SRH: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే యువ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. హింగే తన తొలి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ వంటి టాప్ బ్యాటర్లను ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హింగే ప్రదర్శనతో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఒక్క మ్యాచ్‌తోనే సోషల్ మీడియాలో స్టార్‌గా మారినప్పటికీ.. తాను మారలేదని, ఇది తన కెరీర్‌లో కేవలం చిన్న అడుగే అని ప్రఫుల్ హింగే స్పష్టం చేశాడు. తాజాగా హింగే మాట్లాడుతూ.. 'ప్రేక్షకుల ఒత్తిడిని ముందుగా దూరం పెట్టాలనుకుంటున్నా. నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. అదే ప్రణాళికను మ్యాచ్‌లో అమలు చేస్తున్నా. నేను ఇప్పటికీ మారలేదు. ఇంకా చాలా సాధించాల్సి ఉంది. ఇది కేవలం ప్రారంభమే. నాకు సవాల్ ఇక నుంచి ఎదురుకానుంది' అని తెలిపాడు. అరంగేట్రంలోనే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకొన్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా హింగే నిలిచాడు. అంతేకాదు మొదటి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.

రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన విధానం గురించి కూడా హింగే వివరించాడు. అండర్-23 మ్యాచ్‌లో బౌన్సర్‌తో ఔట్ చేసిన అనుభవం తనకు ఉందన్నాడు. ఈసారి బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతితో పరీక్షించానని, వైభవ్ షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడని చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నెట్స్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు బౌలింగ్ చేయడం తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపాడు. వాళ్లు ప్రతి బంతినీ దాడి చేసే శైలిలో ఆడటంతో మ్యాచ్ పరిస్థితులకు అలవాటు పడ్డాడని చెప్పాడు.

తన కెరీర్ అభివృద్ధికి ఎంఆర్‌ఎఫ్‌ పేస్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషించిందని హింగే పేర్కొన్నాడు. అక్కడ గ్లెన్ మెక్‌గ్రాత్ పర్యవేక్షణలో శిక్షణ పొందడం తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపాడు. అలాగే మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ సహకారం కూడా నాకు బాగా హెల్ప్ అయిందని చెప్పుకొచ్చాడు. అరంగేట్రంలోనే అదరగొట్టిన హింగే.. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌లో హింగే మరో స్టార్ పేసర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌ 2026 వేలంలో సన్‌రైజర్స్‌ అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story