మొన్న వైఎస్ కెప్టెన్, ఇప్పుడు కెప్టెన్.. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు కీలక బాధ్యతలు!

Tilak Varma: Tilak Varma Named South Zone Captain for Duleep Trophy 2026. దులీప్ ట్రోఫీ 2026 కోసం శనివారం 15 మందితో కూడిన సౌత్ జోన్ జట్టును సెలెక్టర్లు శనివారం ప్రకటించారు.

Rishvik
Published on: 2 Aug 2026 5:50 PM IST
Tilak Varma
X

మొన్న వైఎస్ కెప్టెన్, ఇప్పుడు కెప్టెన్.. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు కీలక బాధ్యతలు!

Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 కోసం శనివారం 15 మందితో కూడిన సౌత్ జోన్ జట్టును సెలెక్టర్లు శనివారం ప్రకటించారు. భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు సౌత్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌ సీనియర్ బ్యాటర్ రికీ భుయ్‌ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టును ఎంపిక చేశారు. మాజీ ఆంధ్ర రంజీ క్రికెటర్ ఆర్వీ చంద్రమౌళి ప్రసాద్ నేతృత్వంలో తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, గోవా, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.

ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వేదికగా దులీప్ ట్రోఫీ జరగనుంది. గత ఎడిషన్‌లో సౌత్ జోన్ ఫైనల్‌కు చేరి సెంట్రల్ జోన్ చేతిలో ఓడిపోవడంతో.. ఈసారి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆగస్టు 30న జరిగే సెమీఫైనల్‌లో క్వార్టర్ ఫైనల్-2 విజేతతో సౌత్ జోన్ తలపడనుంది. 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టు సమతూకంగా ఉంది. యువత, అనుభవంను సెలెక్టర్లు చక్కగా మేళవించారు.

సౌత్ జోన్ జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్‌ ఉన్నాడు. అలానే యువ ప్రతిభావంతులు కూడా చోటు దక్కించుకున్నారు. 2025-26 రంజీ ట్రోఫీలో 950 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన కర్ణాటక బ్యాటర్ ఆర్. స్మరణ్ జట్టులో స్థానం సంపాదించాడు. హైదరాబాద్‌కు చెందిన కె. హిమతేజ, గోవా బ్యాటర్ అభినవ్ తేజ్రానా, ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుపై భారత్ 'ఏ' తరఫున ఆడిన షేక్ రషీద్ కూడా జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ బాధ్యతలను తమిళనాడుకు చెందిన ఎన్. జగదీశన్ నిర్వర్తించనున్నాడు.

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్, శ్రేయాస్ గోపాల్ కీలక పాత్ర పోషించనుండగా.. పేస్ దళంలో కే. సాయి తేజ, త్రిపురాన విజయ్, విద్వత్ కావేరప్ప, ఎం.డి. నిదీష్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రకు చెందిన లెవల్-2 కోచ్ ఎంఎన్ విక్రమ్ వర్మను సౌత్ జోన్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించడం విశేషం. ఇటీవలే భారత జట్టుకు తిలక్ వర్మ వైఎస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో నిరూపించుకుంటే.. టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి.

సౌత్ జోన్ జట్టు:

తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజ్రానా, షేక్ రషీద్, కె. హిమతేజ, ఆర్. స్మరణ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయాస్ గోపాల్, కే. సాయి తేజ, త్రిపురాన విజయ్, విద్వత్ కావేరప్ప, హెచ్. అమన్ ఖాన్, ఎం.డి. నిదీష్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story