Tilak Varma: తొలి టీ20లో సూచనలు ఇచ్చా.. కానీ మేం ఓడిపోయాం!
Tilak Varma: India vice-captain Tilak Varma Comments రెండో టీ20 మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Tilak Varma: తొలి టీ20లో సూచనలు ఇచ్చా.. కానీ మేం ఓడిపోయాం!
Tilak Varma: బెల్‌ఫాస్ట్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య చివరిదైన రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్, సుర్యాంశ్ షెడ్గే భారత్ తరఫున అరంగేట్రం చేశారు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ టీ20 మ్యాచ్‌కు ముందు భారత వైస్ కెప్టెన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20లో అనూహ్య ఓటమి ఎదురైనా జట్టులో ఎలాంటి ఆందోళన లేదని, ఒక మ్యాచ్ ఆధారంగా టీమ్‌ను అంచనా వేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశాడు. గతంలో మాదిరిగానే నిర్భయంగా టీ20 క్రికెట్ ఆడుతూ సిరీస్‌ను సమం చేయడమే తమ లక్ష్యమని తెలిపాడు.
వైస్ కెప్టెన్ బాధ్యత గర్వంగా ఉంది:
వైస్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత తనపై బాధ్యత మరింత పెరిగిందని తిలక్ వర్మ చెప్పాడు. 'ఇటీవల ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం నాకు ఉపయోగపడుతోంది. మైదానంలో నాకు తెలిసిన సూచనలను సహచర ఆటగాళ్లతో పంచుకుంటూ జట్టుకు సహాయం చేస్తున్నా. తొలి టీ20లో కూడా వైస్ కెప్టెన్‌గా నా వంతు సూచనలు ఇచ్చా. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదదు. అందరం కాస్త నిరాశ చెందాం. అయితే ఇప్పుడు మరో అవకాశం మా ముందుంది. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయడమే మా టార్గెట్' అని తిలక్ చెప్పుకొచ్చాడు.
ఓటమిపై ఎక్కువగా చర్చించలేదు:
తొలి టీ20లో ఎదురైన పరాజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్దగా చర్చలు జరగలేదని తిలక్ వర్మ వెల్లడించాడు. అది కేవలం ఒకే మ్యాచ్ మాత్రమేనని, అందుకే ఆ ఓటమిని ఎక్కువగా పట్టించుకోకుండా తమ ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టామని చెప్పాడు. టీమ్‌గా తమ బేసిక్స్‌ను పాటిస్తూ.. గత కొన్నేళ్లుగా ఆడుతున్న దూకుడైన టీ20 క్రికెట్‌ను కొనసాగిస్తామని పేర్కొన్నాడు. ఒక మ్యాచ్ ఫలితం జట్టు సామర్థ్యాన్ని నిర్ణయించదని, అందుకే ప్రతి ఆటగాడు తనపై నమ్మకం ఉంచుకోవాలని సూచించాడు.
నిర్భయంగా ఆడటమే మా లక్ష్యం:
భారత జట్టు ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తమ సహజ శైలిలో ఆడాలని తిలక్ వర్మ అన్నాడు. బ్యాటర్‌గా తొలి బంతినే బౌండరీకి తరలించే ధైర్యం కావొచ్చు, బౌలర్‌గా తొలి బంతికే వికెట్ తీసే ఆత్మవిశ్వాసం కావొచ్చు.. ప్రతి ఆటగాడు తన సామర్థ్యాన్ని నమ్ముకుని నిర్భయంగా ఆడాలని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, రెండో టీ20లో పూర్తి స్థాయి ప్రదర్శన చేసి సిరీస్‌ను సమం చేయడానికి భారత జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ స్పష్టం చేశాడు.




