Mumbai Indians New Captain: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు?

Tilak Varma likely to lead MI against RCB in IPL 2026. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Rishvik
Published on: 6 May 2026 10:21 PM IST
Mumbai Indians New Captain
X

Mumbai Indians New Captain: ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు?

Mumbai Indians New Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరగనున్న మ్యాచ్‌కు జట్టు నాయకత్వం మారే ఛాన్సెస్ ఉన్నాయి. యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఉన్నా.. తిలక్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడట.

ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గైర్హాజరీ చర్చనీయాంశమైంది. అతను వెన్ను గాయంతో దూరమయ్యాడా? లేక జట్టు నుంచి తప్పించారా? అన్న దానిపై స్పష్టత లేదు. హార్దిక్ తదుపరి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ఇదే సమయంలో కీలక బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాలతో ఆర్సీబీ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తిరిగి నాయకత్వం స్వీకరించే అవకాశం లేదు. దీంతో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ పేరు ముందుకు రావడం విశేషం.

తిలక్ వర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతని నిలకడైన ప్రదర్శనలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే తీరు.. ఇలా అన్ని కలిసి అతడిని భవిష్యత్తు కెప్టెన్‌గా నిలబెట్టాయి. అందుకే ఈ మ్యాచ్‌లో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నిజమైతే తిలక్ వర్మ మంచి అవకాశం అని చెప్పొచ్చు. తిలక్ ఇప్పటివరకు 64 ఐపీఎల్ మ్యాచులలో 1703 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ప్రస్తుతం ముంబై 10 మ్యాచులలో మూడు విజయాలు అందుకుంది. ఈ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. వరుస పరాజయాల నేపథ్యంలో జట్టులో మార్పులు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో యువ ఆటగాడికి నాయకత్వం అప్పగించడం జట్టుకు కొత్త దిశను చూపే అవకాశంగా భావిస్తున్నారు. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం దాదాపు ఖాయం అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతను ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story