Urvil Patel: ఐపీఎల్‌లో చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఉర్విల్ పటేల్ వెనకుంది చెన్నై సింహం!

MS Dhonis Advice Help Urvil Patel. ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇన్నింగ్స్ వెనుక క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు.

Rishvik
Published on: 11 May 2026 6:56 PM IST
Urvil Patel
X

Urvil Patel: ఐపీఎల్‌లో చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఉర్విల్ పటేల్ వెనకుంది చెన్నై సింహం!

Urvil Patel: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సంచలన ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. 23 బంతుల్లో 65 పరుగులు చేసిన ఉర్విల్ ఇన్నింగ్స్‌లో 8 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. ఈ గుజరాత్ బ్యాటర్ ఆడిన తొలి 8 బంతుల్లోనే 6 సిక్సర్లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.

అయితే ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు ఇన్నింగ్స్ వెనుక చెన్నై మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్ని ఉర్విల్ స్వయంగా వెల్లడించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం లభించినా పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చుకోలేకపోతున్న సమయంలో ధోనీతో జరిగిన సంభాషణ తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపాడు. ‘కొన్ని మ్యాచ్‌ల్లో త్వరగా అవుట్ అవుతున్నాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో మాహీ భాయ్‌తో మాట్లాడాను. మంచి స్టార్ట్ వస్తోంది కానీ దాన్ని పెద్ద స్కోర్‌గా ఎలా మార్చుకోవాలి అని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఒక్క మాట చెప్పారు. నీ స్కిల్స్‌పై నాకు ఎలాంటి సందేహం లేదు. సందేహం అంతా నీ మనసులోనే ఉంది. క్లియర్ మైండ్‌తో సరైన బంతిని సరైన ప్రాంతానికి ఆడేందుకు ప్రయత్నించు అని చెప్పారు’ అంటూ ఉర్విల్ తెలిపాడు.

ఎంఎస్ ధోనీ చెప్పిన ఆ మాటలు తనలోని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చాయని ఉర్విల్ పటేల్ అన్నాడు. ‘మాహీ భాయ్ ఇచ్చిన సలహా వల్ల నా మైండ్ పూర్తిగా క్లియర్ అయింది. నా సహజ ఆటను ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రదర్శన చూసి ఆయన కూడా చాలా సంతోషపడతారని అనుకుంటున్నాను’ అని చెప్పాడు. ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని ఉర్విల్ భావోద్వేగంగా తెలిపాడు. ‘ఐపీఎల్‌లో నా తొలి హాఫ్ సెంచరీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. అది కూడా 13 బంతుల్లో చేయడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ ఫిఫ్టీని నా తండ్రికి అంకితం చేస్తున్నాను’ అని పేర్కొన్నాడు.

గత కొన్ని మ్యాచ్‌ల్లో త్వరగా అవుట్ అవుతున్నప్పటికీ తన తండ్రి ఎప్పుడూ ధైర్యం చెప్పేవారని ఉర్విల్ పటేల్ తెలిపాడు. ‘నువ్వు ఎలా ఆడినా నాకు చాలా ఇష్టం. పరుగులు వచ్చినా, రాకపోయినా భయపడకుండా ఇలాగే ఆడు అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నీ నుంచి ఏమీ ఆశించడం లేదు. నువ్వు ఈ స్థాయిలో ఉన్నందుకు మాకు గర్వంగా ఉందని చెప్పేవాడు. నేను ఎప్పుడూ నా తండ్రి కోసం ఆడతాను’ అని చెప్పుకొచ్చాడు. రికార్డు ఫిఫ్టీ పూర్తి చేసిన తర్వాత ఉర్విల్ ఒక చిన్న నోట్ చూపిస్తూ సెలబ్రేట్ చేశాడు. అందులో ‘ఇది మీ కోసమే నాన్న’ అని రాసి ఉండటం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే దేవుడి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని ఆ నోట్‌లో పేర్కొన్నాడు.

మరోవైపు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా పిచ్ పరిస్థితుల గురించి కీలక సూచనలు చేశాడని ఉర్విల్ పటేల్ తెలిపాడు. ‘పిచ్ బాగుందని, బంతి బాగా వస్తోందని రుతు చెప్పాడు. మొదటి సిక్స్ కొట్టిన తర్వాత వికెట్ చాలా బాగుందని అర్థమైంది. నా రేంజ్‌లో బంతి పడితే 100 శాతం హిట్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు. రికార్డుల గురించి పెద్దగా ఆలోచించలేదని ఉర్విల్ స్పష్టం చేశాడు. ‘కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ గురించి తెలుసు. కానీ నా దృష్టి మొత్తం ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీపై మాత్రమే ఉంది. అందుకే కొన్ని సార్లు సింగిల్స్ తీసేందుకు కూడా ప్రయత్నించాను’ అని తెలిపాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story