Vaibhav Sooryavanshi: బుడ్డోడి విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులు!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు.

Rishvik
Published on: 20 May 2026 6:05 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: బుడ్డోడి విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నో అరుదైన రికార్డులు!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతోంది. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో వైభవ్ ఆడిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో.. ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉండేది. 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన పంత్.. 20 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు కేవలం 15 ఏళ్లకే వైభవ్ ఈ ఘనత అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులు చేసిన వైభవ్.. 236.3 స్ట్రైక్‌రేట్‌తో రన్స్ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (2019లో 204.8), అభిషేక్ శర్మ (2026లో 202.0), నికోలస్ పూరన్ (2025లో 196.2), ట్రావిస్ హెడ్ (2024లో 191.5), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2014లో 187.7), క్రిస్ గేల్ (2011లో 183.1) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 భారీ సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 53 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు వైభవ్ రెండో స్థానంలో నిలిచాడు. 2012లో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 59 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం వైభవ్ 53 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నా.. ఆర్ఆర్ ఇంకో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ప్లేఆఫ్స్ చేరితే గేల్ రికార్డు బ్రేక్ అవ్వడం ఖాయం. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (52 - 2019) రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ (51 - 2013), జోస్ బట్లర్ (45 - 2022), అభిషేక్ శర్మ (42 - 2024) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరో అరుదైన రికార్డు కూడా వైభవ్ సూర్యవంశీ ఖాతాలో చేరింది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండు సార్లు 10కి పైగా సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా ఇదే ఫీట్ సాధించాడు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్, అభిషేక్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ కొత్త రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ బ్యాటర్లు పవర్‌ప్లేలో మొత్తం 60 సిక్సర్లు బాదగా.. అందులో వైభవ్ ఒక్కడే 37 సిక్సర్లు కొట్టాడు. యశస్వి జైస్వాల్ 12 సిక్సర్లు బాదగా.. మిగతా జట్టు కలిపి 11 సిక్సర్లు మాత్రమే కొట్టడం విశేషం. గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండేది. 2024లో ఎస్‌ఆర్‌హెచ్ పవర్‌ప్లేలో 59 సిక్సర్లు బాదింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (60), మిచెల్ మార్ష్ (96) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ దూకుడు ముందు లక్నో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ధ్రువ్ జురెల్ కూడా 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ కేవలం 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఆర్ఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి.. ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుచుకుంది. మిగిలిన ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే.. రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరుతుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story