Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు, 15 బంతుల్లో ఫిఫ్టీ.. ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర!
Vaibhav Sooryavanshi Creates History in IPL: 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన భారతీయుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ మరోసారి చోటు దక్కించుకున్నాడు.
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భాగంగా గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. ఈ పోరులో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన భారతీయుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ మరోసారి చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల జాబితాలో యశస్వి జైస్వాల్ అగ్రస్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 13 బంతులతో ఫిఫ్టీ బాదాడు. కేఎల్ రాహుల్ 14 బంతులతో అర్ధ శతకం చేసి రెండో స్థానంలో ఉన్నాడు. యూసుఫ్ పఠాన్ (15 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. వైభవ్ రెండుసార్లు 15 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. టాప్ బౌలర్లను ఎదుర్కొని 15 ఏళ్ల వయసులో 15 బంతుల్లో ఫిఫ్టీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. కానీ వైభవ్ మాత్రం రెండుసార్లు ఈ ఘనత అందుకోవడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ లాంటి వారికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి జైస్వాల్ (2023), కేఎల్ రాహుల్ (2018) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. పాట్ కమిన్స్ (14 బంతులు, 2022), రొమారియో షెపర్డ్ (14 బంతులు, 2025) 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదారు. యూసుఫ్ పఠాన్ (15 బంతులు, 2014), సునీల్ నరైన్ (15 బంతులు, 2017), నికోలస్ పూరన్ (15 బంతులు, 2023), జేక్ ఫ్రేజర్-మెక్‌గార్క్ (15 బంతులు, 2024), వైభవ్ సూర్యవంశీ (15 బంతులు, 2026) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వైభవ్ ఐపీఎల్ 2026లోనే రెండుసార్లు 15 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. చెన్నై, బెంగళూరుపై హాఫ్ సెంచరీలు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు:
# 13 బంతులు: యశస్వి జైస్వాల్ (RR vs KKR, 2023)
# 14 బంతులు: కేఎల్ రాహుల్ (PBKS vs DC, 2018)
# 14 బంతులు: పాట్ కమిన్స్ (KKR vs MI, 2022)
# 14 బంతులు: రొమారియో షెపర్డ్ (RCB vs CSK, 2025)
# 15 బంతులు: యూసుఫ్ పఠాన్ (KKR vs SRH, 2014)
# 15 బంతులు: సునీల్ నరైన్ (KKR vs RCB, 2017)
# 15 బంతులు: నికోలస్ పూరన్ (LSG vs RCB, 2023)
# 15 బంతులు: జేక్ ఫ్రేజర్-మెక్‌గార్క్ (DC vs SRH/MI, 2024)
# 15 బంతులు: వైభవ్ సూర్యవంశీ (RR vs CSK/RCB, 2026)




