Vaibhav Sooryavanshi: 'ప్రపంచాన్ని ఏలే సమయం వచ్చింది'.. వైభవ్ అరంగేట్రంతో సోషల్ మీడియా షేక్!

Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi becomes India's youngest debutant. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు.

Rishvik
Published on: 4 July 2026 9:47 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: 'ప్రపంచాన్ని ఏలే సమయం వచ్చింది'.. వైభవ్ అరంగేట్రంతో సోషల్ మీడియా షేక్!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్.. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత పురుషుల జట్టుకు ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతతో దాదాపు 37 ఏళ్లుగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ రికార్డును బుడ్డోడు అధిగమించాడు. అంతేకాకుండా పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగానూ నిలిచాడు.

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం అనంతరం సోషల్ మీడియాలో అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. '04-07-2026.. ఈ తేదీని గుర్తుంచుకోండి. భారత క్రికెట్‌లో చరిత్ర సృష్టించబడింది. వైభవ్ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పలువురు అభిమానులు కూడా భారత జట్టులో కొత్త శకం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టులో.. 'వైభవ్.. ఇప్పుడు ఎమోషనల్ అయ్యే సమయం కాదు. ప్రపంచాన్ని ఏలే సమయం వచ్చింది. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో ఎవరూ చేయని ఘనత సాధించావు. ఐపీఎల్‌లో చూపించిన అదే దూకుడును భారత జట్టు తరఫున కూడా కొనసాగించు' అంటూ అతడికి శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ జట్టులో వైభవ్‌కు అవకాశం ఇవ్వడానికి ముందు నుంచే భారీ చర్చ సాగింది. ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్ తొలి టీ20లోనూ అతడు బెంచ్‌కే పరిమితమవడంతో అభిమానులు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రెండో టీ20లో సంజు శాంసన్ స్థానంలో వైభవ్‌కు అవకాశం కల్పించింది భారత టీమ్ మేనేజ్‌మెంట్. మ్యాచ్‌లో అతడు 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటైనప్పటికీ.. అతడి అరంగేట్రం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయింది.

వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కడానికి ప్రధాన కారణం అతడు ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కనబరిచిన అసాధారణ ప్రదర్శనే. ఆ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు నమోదు చేయడంతో పాటు రికార్డు స్థాయిలో 72 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు.

అయితే ప్రపంచ పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా పేరిటే కొనసాగుతోంది. హసన్ రజా 1996లో 14 సంవత్సరాల 227 రోజుల వయసులో టెస్టు అరంగేట్రం చేసి ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ భారత క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story