Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్!

Vaibhav Sooryavanshi Creates History 81 against Zimbabwe. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు.

Rishvik
Published on: 26 July 2026 6:31 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 49 బంతుల్లో 81 రన్స్ చేశాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. జింబాబ్వే సిరీస్‌లో సూర్యవంశీకి ఇది రెండో అర్ధశతకం కావడం విశేషం. దాంతో ఈ 15 ఏళ్ల బ్యాటర్ అరుదైన మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు నిండకముందే రెండు హాఫ్ సెంచరీలు చేసిన పూర్తి సభ్యత్వ దేశానికి చెందిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు టెస్టు హోదా కలిగిన ఏ దేశానికి చెందిన ఆటగాడు కూడా ఈ ఘనత అందుకోలేదు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును ఈ యువ బ్యాటర్ తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 16 ఏళ్లు నిండకముందే రెండు 50+ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అంతకుముందు నేపాల్ యువ బ్యాటర్ కుశాల్ మల్లా మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు పూర్తి సభ్యత్వ దేశాల జాబితాలో మాత్రం వైభవ్ ఒక్కడే ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. తొలి టీ20లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. రెండో మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక మూడో టీ20లో మరోసారి అర్ధశతకం నమోదు చేసి.. తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ చేశాడు. వరుసగా మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత టాప్ ఆర్డర్‌కు బుడ్డోడు కీలక బలంగా మారుతున్నాడు. ఇదీ ఫామ్ కొనసాగిస్తే.. వన్డేల్లో ఆడే అవకాశాలు లేకపోలేదు.

మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. గాయపడిన ప్రిన్స్ యాదవ్ స్థానంలో అశోక్ శర్మ జట్టులోకి రాగా.. శివమ్ దూబే స్థానంలో యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు అవకాశం లభించింది. మూడో టీ20లో భారత్ ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (27), రింకు సింగ్ (25), తిలక్ వర్మ (11) పరుగులు చేశారు. అభిషేక్ శర్మ (2) విఫలమయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్స్ పడగొట్టాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story