Vaibhav Sooryavanshi: బీసీసీఐ సెలెక్టర్లకు కొత్త తలనొప్పిగా వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi major selection dilemma for BCCI. వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు సెలెక్టర్లకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాడు.
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సెలెక్టర్లకు కొత్త తలనొప్పిగా వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు సెలెక్టర్లకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అవకాశాలు దక్కినా పెద్దగా పరుగులు చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బుడ్డోడు.. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా.. 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు బుడ్డోడిని భారత జట్టు నుంచి తప్పించడం సెలెక్టర్లకు అంత ఈజీ కాదు.
ఇంగ్లండ్ పర్యటనలో సంజు శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ తొలి మూడు అవకాశాలను పూర్తిగా సద్వినియోగించుకోలేకపోయాడు. 14, 13, 15 పరుగులతో నిరాశపరచడంతో సిరీస్ నిర్ణయాత్మక ఐదవ టీ20 మ్యాచ్‌లో అతడిని బెంచ్‌కు పరిమితం చేశారు. అంత చిన్న వయసులోనే అతడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావడం తొందరపాటు నిర్ణయమని పలువురు విమర్శించారు. అయినప్పటికీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ అతడిపై నమ్మకం ఉంచి జింబాబ్వే సిరీస్‌కు కూడా ఎంపిక చేసింది. బీసీసీఐ సెలెక్టర్ల విశ్వాసాన్ని వైభవ్ పూర్తిగా నిలబెట్టాడు. బుడ్డోడు బ్యాట్‌తో అదరగొట్టి.. విమర్శకుల నోళ్లు మూయించాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వైభవ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా మారింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇదే వేదికపై అంతర్జాతీయ టీ20ల్లో మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండో టీ20లో 9 బంతుల్లో 20 పరుగులు బాదాడు. ఇక మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌ల్లో 151 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
వైభవ్ బ్యాటింగ్‌లో కేవలం దూకుడే కాదు.. పరిస్థితులకు అనుగుణంగా ఆడే పరిపక్వత కూడా కనిపించిందని భారత తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసించాడు. గత రెండేళ్లలో అతడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యానికి గురిచేసిందని, ఒత్తిడిని తట్టుకుని ఆడే మానసిక బలం కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నాడు. చిన్న వయసులోనే పరిస్థితులను అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించగల సామర్థ్యం వైభవ్ ప్రత్యేకతగా మారిందని అభిప్రాయపడ్డాడు. అయితే వైభవ్ బ్యాటింగ్తో భారత టాప్ ఆర్డర్ ఎంపిక ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది. జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోయిన సంజు శాంసన్ మళ్లీ జట్టులో చోటు సంపాదించడం ఇప్పుడు సవాలుగా మారింది.
మరోవైపు అభిషేక్ శర్మ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. వరుసగా 2, 8, 1, 3, 16, 10 పరుగుల స్కోర్లతో అతడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా జింబాబ్వే సిరీస్‌లో పూర్తిగా విఫలమవడంతో అతడిపై ఒత్తిడి మరింత పెరిగింది. ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఫామ్ అతడికి పెద్ద సమస్యగా మారింది. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి బెరుకు లేకుండా ఆడడంతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే పరిపక్వతను ప్రదర్శిస్తున్న వైభవ్ భారత క్రికెట్‌కు భవిష్యత్తు స్టార్‌గా కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్‌ను గెలిపించిన ఓపెనింగ్ జోడీ సంజు, అభిషేక్ శర్మలో మార్పులు చేయాలా? లేక వైభవ్‌కు మరో పాత్ర ఇవ్వాలా? అనే క్లిష్టమైన ప్రశ్న ఇప్పుడు సెలెక్టర్ల ముందుంది. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌లు, ప్రధాన టోర్నీలకు ముందు భారత టాప్ ఆర్డర్ ఎంపిక అత్యంత ఆసక్తికరంగా మారింది.




