Vaibhav Sooryavanshi Debut: ఆ పాలసీ ప్రకారం ఒకరిని తీసేసి.. వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వండి!

Vaibhav Sooryavanshi Debut: Sarandeep Singh on Vaibhav Sooryavanshi Debut. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Rishvik
Published on: 1 July 2026 9:00 PM IST
Vaibhav Sooryavanshi Debut
X

Vaibhav Sooryavanshi Debut: ఆ పాలసీ ప్రకారం ఒకరిని తీసేసి.. వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వండి!

Vaibhav Sooryavanshi Debut: భారత్-ఇంగ్లండ్ మధ్య ఈరోజు ప్రారంభం కానున్న తొలి టీ20కు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు అతడికి అవకాశం ఇవ్వకపోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సరందీప్ సింగ్.. కెప్టెన్, కోచ్‌కు కీలక సూచనలు చేశాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జట్టులో రొటేషన్ పాలసీ అమలు చేసి.. వైభవ్‌కు అవకాశం కల్పించాలని సూచించాడు.

రొటేషన్ పాలసీ అమలు చేయాలి:

పీటీఐతో మాట్లాడిన సరందీప్ సింగ్.. ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. జట్టు భవిష్యత్తు కోసం ఆలోచిస్తే కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లను పరీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 'జట్టు భవిష్యత్తు కోసం సిద్ధమవుతుంటే రొటేషన్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. కొంతమంది సీనియర్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. వైభవ్‌కు కూడా అదే విధంగా ఛాన్స్ కల్పించాలి' అని సరందీప్ పేర్కొన్నాడు.

ఇదే సరైన సమయం:

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల శ్రీలంకలో భారత్-ఏ తరఫున కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున అతడిని భారత జట్టులో ఆడించేందుకు ఇదే సరైన సమయమని సరందీప్ అభిప్రాయపడ్డాడు. 'ఇలాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టకూడదు. అవకాశం ఉంటే వెంటనే ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలి. ప్రస్తుతం వైభవ్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు' అని ప్రశంసించాడు.

మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉంది:

వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20లకే పరిమితమయ్యే ఆటగాడు కాదని, భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు సేవలందించే సామర్థ్యం అతడికి ఉందని సరందీప్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 'వైభవ్ వయసు చాలా చిన్నది. అతడు రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతడిలో మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఆడేంత ప్రతిభ ఉంది' అని సరందీప్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రొటేషన్ పాలసీ ప్రకారం.. సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఒకరిని తప్పించి.. బుడ్డోడికి అవకాశం ఇవ్వాలని సరందీప్ అంటున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story