Vaibhav Sooryavanshi: ఫామ్ వల్ల కాదు.. వైభవ్ సూర్యవంశీని తప్పించడానికి అసలు కారణం చెప్పిన శ్రేయస్!

Shreyas Iyer Reaction on Vaibhav Sooryavanshi Dropped. వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తప్పించడం వెనకున్న కారణాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.

Rishvik
Published on: 12 July 2026 4:55 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: ఫామ్ వల్ల కాదు.. వైభవ్ సూర్యవంశీని తప్పించడానికి అసలు కారణం చెప్పిన శ్రేయస్!

Vaibhav Sooryavanshi: ఫామ్ వల్ల కాదు.. వైభవ్ సూర్యవంశీని తప్పించడానికి అసలు కారణం చెప్పిన శ్రేయస్!

ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత తుది తుది జట్టులో చోటు దక్కలేదు. బుడ్డోడిని తుది జట్టు నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైభవ్ స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. వైభవ్‌ను తప్పించి శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు చేయకపోవడంతోనే బుడ్డోడిపై వేటు పడిందని అంతా భావించారు. అయితే మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసలు కారణాన్ని వెల్లడించాడు.

వైభవ్‌ సూర్యవంశీని ఫామ్ కారణంగా తప్పించలేదని, ఓపెనింగ్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. 'అభిషేక్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్. అతడికి జోడీగా రైట్ ఆర్మ్ బ్యాటర్‌ను పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అందుకే లెఫ్ట్ హ్యాండర్ అయిన వైభవ్ స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇచ్చాము. ఇంగ్లండ్ పరిస్థితులకు సరిపోయే అత్యుత్తమ కాంబినేషన్‌ను పరీక్షించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశాం' అని సర్పంచ్ సాబ్ చెప్పాడు. శాంసన్‌పై శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. 'గతంలో భారత్‌కు ఎన్నో సిరీస్‌ల్లో సంజు కీలక ప్రదర్శనలు చేశాడు. అతడు అద్భుతమైన బ్యాటర్. భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. అభిషేక్‌తో కలిసి కుడిచేతి బ్యాటర్ ఓపెనింగ్ చేయాలని భావించడం కూడా వైభవ్‌ను తప్పించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి' అని శ్రేయస్ వివరించాడు.

ఇంగ్లండ్‌తో మూడు టీ20ల్లో వైభవ్ సూర్యవంశీ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో బుడ్డోడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చివరి టీ20లో ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చాలని నిర్ణయించిన భారత జట్టు.. వైభవ్‌కు విశ్రాంతి ఇచ్చి సంజు శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20కి కూడా భారత తుది జట్టులో సంజు ఉన్నాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే యువ బ్యాటర్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో ఐదో టీ20లో సంజుకు మరో అవకాశం దక్కింది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడంపై కూడా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'ఈ పరాజయాలకు ఒక్క కారణాన్ని మాత్రమే చెప్పలేను. ప్రతి మ్యాచ్‌కు వేదికలు మారడం, మైదానాల పరిమాణం, భిన్నమైన పరిస్థితులకు వేగంగా అలవాటు పడలేకపోవడం జట్టుకు సవాలుగా మారింది. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్‌ను పూర్తిగా అధిగమించింది. ఇంగ్లండ్‌కు వచ్చి సిరీస్ గెలుస్తామని అనుకుంటే సరిపోదు. అందుకు కష్టపడాలి, పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. మేము ప్రయత్నించినప్పటికీ ప్రత్యర్థి అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన క్రికెట్ ఆడింది. అందుకే ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చాయి' అని శ్రేయస్ పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా తన ప్రయాణం నిరాశాజనకంగా ప్రారంభమైనప్పటికీ.. ఈ పరాజయాల నుంచి నేర్చుకుని మరింత మెరుగవుతానని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. 'అభిమానులు ఈ సిరీస్‌ను ఎలా చూస్తారనే విషయంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఆటలో గెలుపోటములు సహజం. ఒత్తిడిలో రాణించడం, క్లిష్ట పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకోవడమే నన్ను మెరుగైన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తీర్చిదిద్దుతుంది. భవిష్యత్తులో ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని విదేశీ పర్యటనలు ఉన్నాయి. కాబట్టి ఆటగాళ్ల మధ్య మంచి సమన్వయం పెంచడం, పరిస్థితులకు సరిపోయే అత్యుత్తమ జట్టు కాంబినేషన్‌ను సిద్ధం చేయడమే మా ప్రధాన లక్ష్యం' అని శ్రేయస్ స్పష్టం చేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story