Vaibhav Sooryavanshi: అదే నా మొదటి ప్రాధాన్యత.. అరంగేట్రం అనంతరం వైభవ్ తొలి పోస్ట్ వైరల్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత చేసిన తొలి సోషల్ మీడియా పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Vaibhav Sooryavanshi: అదే నా మొదటి ప్రాధాన్యత.. అరంగేట్రం అనంతరం వైభవ్ తొలి పోస్ట్ వైరల్!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత చేసిన తొలి సోషల్ మీడియా పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శనివారం ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన 15 ఏళ్ల వైభవ్.. మ్యాచ్ ముగిసిన అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. తనకు అండగా నిలిచిన అభిమానులు, సహచర ఆటగాళ్లు, సీనియర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఈ పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీకి ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో ప్లేయింగ్ 11లో అవకాశం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితమైన అతడికి చివరకు మాంచెస్టర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే రెండు భారీ సిక్సర్లు బాదిన వైభవ్.. తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ.. మ్యాచ్‌లో ప్రధాన చర్చనీయాంశంగా వైభవ్ అరంగేట్రమే నిలిచింది.
మ్యాచ్ అనంతరం భారత జెర్సీలో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న వైభవ్.. 'నాకు వచ్చిన ప్రతి సందేశానికి నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాపై ప్రేమ, మద్దతు చూపిన నా శ్రేయోభిలాషులు, సీనియర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు ఎంతో గర్వకారణం. జట్టుకు అవకాశం వచ్చిన ప్రతిసారీ నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. జట్టు విజయమే నా మొదటి ప్రాధాన్యత. ఎప్పుడూ విజయం కోసమే ఆడతాన. మీ అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.
వైభవ్ చేసిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన వైభవ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్, షెఫాలీ వర్మ పేరిట ఉన్న భారత అత్యంత పిన్న వయస్కుల అరంగేట్ర రికార్డులను అధిగమించిన వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. జేకబ్ బెతెల్ 76 , హ్యారీ బ్రూక్ 39, టామ్ బాంటన్ 39 కీలక ఇన్నింగ్స్‌లతో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌లో 29 పరుగులు రావడం మ్యాచ్ మలుపు తిప్పింది. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సమం చేసింది.




