Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి తీసుకునేలా వైభవ్ ఒత్తిడి చేశాడు.. బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: Ajit Agarkar on Vaibhav Sooryavanshi Debut 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.

Rishvik
Updated on: 6 Jun 2026 7:15 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి తీసుకునేలా వైభవ్ ఒత్తిడి చేశాడు.. బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో బుడ్డోడిని ఎంపిక చేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

అద్భుత ప్రదర్శన కారణంగానే:

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నా.. టోర్నీలో 750కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 776 పరుగులు చేసిన వైభవ్.. 237.31 అద్భుత స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అంతేకాకుండా ఒకే సీజన్‌లో 72 సిక్సర్లు బాది.. 14 ఏళ్లుగా చెక్కుచెదరని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2025, దేశవాళీ, ఐపీఎల్ 2026 ప్రదర్శన కారణంగానే వైభవ్ భారత జట్టులోకి వచ్చాడు.

మాపై ఒత్తిడి పెంచాడు:

వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. 'ఇంత చిన్న వయసులో వైభవ్ బ్యాటింగ్ అసాధారణం. ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఒంటిచేత్తో ముందుకు నడిపించాడు. అతని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ మాత్రమే కాదు..

గత సీజన్ నుంచే వైభవ్ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. టీమిండియాలోకి ఎంపిక చేసేలా వైభవ్ తన ఆటతో మాపై ఒత్తిడి పెంచాడు. ఇన్ని రన్స్ చేసినా చేసినా ఎంపిక చేయకుంటే కుదరదు. అతడు రాణిస్తాడనే నమ్మకం మాకు ఉంది' అని అగార్కర్ చెప్పారు.

వైభవ్ గేమ్ ఛేంజర్:

'అత్యంత పోటీతో కూడిన, ఒత్తిడితో నిండిన ఐపీఎల్ వంటి వేదికపై వైభవ్ సూర్యవంశీ చూపించిన ధైర్యం, దూకుడు ప్రత్యేకం. మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పగల సామర్థ్యం అతనిలో ఉంది. అతడు గేమ్ ఛేంజర్. టీ20 క్రికెట్‌ను దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మాకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి మేము అతడిని ఎంపిక చేయలేదు. అతడే ఎంపిక చేసే ప్రదర్శన చేశాడు' అని అజిత్ అగార్కర్ ప్రశంసించారు.

వైభవ్ ఎదుగుదల గత రెండు సీజన్లుగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 2026 సీజన్‌లో మరో సెంచరీ బాదడమే కాకుండా.. రెండు సార్లు 90లలో ఔటై మరో రెండు శతకాలను చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అతని ప్రదర్శన టోర్నీలో అత్యంత ప్రభావవంతమైనదిగా నిలిచింది.

శ్రీలంకలో బుడ్డోడు:

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో ఇండియా-ఏ జట్టుతో కలిసి త్రైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటున్నాడు. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ టీ20 సిరీస్‌తో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో కూడా ఆడనున్నాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశ జట్టులో చోటు దక్కించుకున్న సూర్యవంశీపై ఇప్పుడు అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. తన అద్భుత ప్రతిభతో ఇప్పటికే భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందిన ఈ యువ బ్యాటర్.. అంతర్జాతీయ వేదికపై కూడా అదే జోరును కొనసాగిస్తాడా అనే ఆసక్తి నెలకొంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story