Vaibhav Sooryavanshi: ఐసీసీ నిబంధనలు.. వైభవ్ సూర్యవంశీకి నో ఎంట్రీ!
Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi Have Separate Changing Room. వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
Vaibhav Sooryavanshi: ఐసీసీ నిబంధనలు.. వైభవ్ సూర్యవంశీకి నో ఎంట్రీ!
Why Vaibhav Sooryavanshi Can't Use India's Dressing Room: భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ సంచలనం.. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొననున్నాడు. అయితే ఈ టూర్లలో వైభవ్‌కు ఇతర ఆటగాళ్లతో కలిసి భారత డ్రెస్సింగ్ రూమ్ ఉపయోగించే అవకాశం లేదు. బుడ్డోడి కోసం ప్రత్యేకంగా చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.
అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్:
ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఐర్లాండ్ లేదా ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేస్తే.. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ మీడియా నివేదికల ప్రకారం.. ఇంగ్లండ్ సిరీస్ ఐసీసీ ఆమోదించిన అధికారిక టోర్నమెంట్ కావడంతో.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమలు చేసే ‘సేఫ్ గార్డింగ్’ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రత్యేక డ్రెస్సింగ్ సదుపాయాలు:
సేఫ్ గార్డింగ్ నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే చేంజింగ్ రూమ్‌ను ఉపయోగించకూడదు. అందుకే వైభవ్ సూర్యవంశీ కోసం ప్రతి వేదికలో ప్రత్యేక డ్రెస్సింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ నిబంధన కేవలం దుస్తులు మార్చుకునే సమయంలో మాత్రమే వర్తిస్తుంది. మ్యాచ్‌ల సమయంలో భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటానికి, జట్టు సమావేశాల్లో పాల్గొనడానికి, కోచ్‌లు మరియు సహచర ఆటగాళ్లతో కలిసి ఉండటానికి ఎలాంటి పరిమితులు ఉండవు. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ అనంతరం మాత్రమే ప్రత్యేక చేంజింగ్ రూమ్‌ను బుడ్డోడు ఉపయోగించాల్సి ఉంటుంది. భారత డ్రెస్సింగ్ రూమ్‌కు నో ఎంట్రీ అన్నమాట.
తొలిసారిగా సీనియర్ జట్టుతో:
ఇక వైభవ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఈ రెండు పర్యటనలో ఉండనున్నారు. 15 ఏళ్ల బాలుడు తొలిసారిగా సీనియర్ జట్టుతో విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అతడికి కుటుంబ సభ్యుల అండ అవసరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు. సీనియర్ జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లు, సిబ్బంది అందరూ పెద్దవారే కావడంతో చిన్న వయసులో ఉన్న వైభవ్‌కు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 'చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు చాలా అరుదు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ చిన్న వయసులో భారత జట్టులోకి వచ్చినట్లే.. ఇప్పుడు వైభవ్ కూడా ప్రత్యేకమైన ప్రతిభతో జట్టులోకి వచ్చాడు. అలాంటి యువ ఆటగాడికి కుటుంబం తోడుగా ఉంటే అతడు త్వరగా జట్టుకు అలవాటు పడతాడు' అని సైకియా పేర్కొన్నారు.
అరంగేట్రం చేసే అవకాశాలు మెండు:
జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్లో ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో భారత క్రికెట్ అభిమానులు బుడ్డోడి ఆట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్న వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.




