Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఫుల్ డిమాండ్.. ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.30 కోట్లు!
Sehwag To bid for Vaibhav Sooryavanshi. ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఫుల్ డిమాండ్.. ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.30 కోట్లు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్లపై విరుచుకుపడుతున్న బుడ్డోడు.. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. వైభవ్ ఆటకు క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అవుతున్నారు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ చూసిన మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. వైభవ్ ఐపీఎల్ వేలంలోకి వస్తే.. రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తానని చెప్పాడు. వీరూ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో మాజీ చెన్నై ఆటగాడు సురేష్ రైనాతో పాటు సంయుక్తంగా వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేశాడు. మొత్తం 29 బంతుల్లో 97 పరుగులు చేసి.. సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. లేదంటే ఫాస్టెస్ట్ సెంచరీ కూడా బాదేవాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. గేల్ 2012లో కొట్టిన 59 సిక్సర్ల రికార్డును అధిగమించి.. వైభవ్ ఈ సీజన్‌లో 65 సిక్సర్లు బాదాడు.
ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీలో ఉన్న మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘వైభవ్ ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎంత వరకు బిడ్ చేస్తారు?’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ను ప్రశ్నించాడు. దీనికి ఏమాత్రం ఆలోచించకుండా సెహ్వాగ్ రూ.30 కోట్లు అని సమాధానం చెప్పాడు. వెంటనే మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. నేను కూడా రూ.30 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైభవ్‌పై మాజీ క్రికెటర్లకు ఉన్న నమ్మకం, అతడి టాలెంట్‌పై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి. నిజంగా వైభవ్ వేలంలోకి వస్తే.. అతడిని దక్కించుకునేందుకు 10 ప్రాంఛైజీలు పోటీ పడుతాయని చెప్పడంలో ఎలాంటి ఆతిశయోక్తి లేదు. మరి రాజస్థాన్ జట్టు అంత ఈజీగా బుడ్డోడిని వదులుకుంటుందా?.
వైభవ్ సూర్యవంశీని త్వరగా భారత సీనియర్ జట్టులోకి తీసుకురావాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఐపీఎల్ అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా కాకముందే ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయిన బుడ్డోడు.. వచ్చే నెలలో భారత్-ఏ జట్టుతో శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తిలక్ వర్మ కెప్టెన్సీలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్‌లో వైభవ్ ఆడనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసి.. భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
వైభవ్ భవిష్యత్తుపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ చాలా ప్రత్యేకమైన టాలెంట్ ప్లేయర్. బీసీసీఐ, రాజస్థాన్ రాయల్స్ కలిసి అతడిని సరైన దారిలో నడిపించాలి. క్రీడ అంటే కేవలం శారీరక ప్రతిభ మాత్రమే కాదు.. మానసిక ధైర్యం కూడా చాలా ముఖ్యం. అతడి టెంపరమెంట్ అలాగే ఉండేలా జాగ్రత్త పడాలి. అతడు చాలా కాలం భారత జట్టుకు సేవలందించగలడు. అతడిని మనం కాపాడుకోవాలి’ అని చెప్పాడు. ప్రస్తుతం వైభవ్ ఆట చూస్తుంటే.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు అతడు మరో సూపర్ స్టార్‌గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




