Vaibhav Sooryavanshi: సచిన్ దేవుడు.. దేవుడి కుమారుడు వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు.

Rishvik
Published on: 19 Jun 2026 6:17 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: సచిన్ దేవుడు.. దేవుడి కుమారుడు వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన అసాధారణ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారతాడని అభిప్రాయపడ్డారు. వైభవ్‌ను బీసీసీఐ చాలా జాగ్రతగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా అతడిని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోల్చవద్దని కోరారు. సచిన్ దేవుడు అయితే.. దేవుడి కుమారుడు వైభవ్ అంటూ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోసే ఆటగాడు:

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీకి ఇటీవల భారత టీ20 జట్టులో తొలి అవకాశం దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపికైన ఈ యువ ఆటగాడిపై శ్రీకాంత్ భారీ ఆశలు పెట్టుకున్నారు. 'వైభవ్‌లో పరుగులు చేయాలనే ఆకలి ఉంది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలనే తపన కనిపిస్తుంది. అదే సమయంలో అవసరమైతే క్రీజులో నిలబడి పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. అతడు టీ20 నుంచి వన్డేలు, ఆపై టెస్ట్ క్రికెట్‌లో విజయవంతమైతే.. టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ పునర్జీవం వస్తుంది' అని శ్రీకాంత్ అన్నారు.

వైభవ్ కోసం టీవీ ఆన్ చేస్తాను:

వైభవ్ ఆటలో ప్రత్యేక ఆకర్షణ ఉందని శ్రీకాంత్ కొనియాడారు. 'ప్రస్తుతం జనాలు వైభవ్ ఆటను చూడటానికే టీవీ ఆన్ చేస్తున్నారు. నేను కూడా అతని బ్యాటింగ్ చూడటానికి టీవీ చూస్తాను. అంతటి ఆరా అతడు సృష్టించాడు. అతడు నిజంగా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడు' అని ప్రశంసించారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ పర్యటనలో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

అయితే దీనిపై అతడిని విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. 'ఒక సిరీస్‌తో ఆటగాడిని అంచనా వేయకూడదు. అతడు ఇంకా చిన్నవాడు. సమయం ఇవ్వాలి. ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా ఆడాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను అధిగమించి అవార్డులు గెలుచుకున్నాడు. అతడికి అద్భుతమైన షాట్ మేకింగ్ సామర్థ్యం, అసాధారణ దృష్టి ఉన్నాయి' అని చెప్పారు.

భారత క్రికెట్ భవిష్యత్తు అతడే:

వైభవ్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ సూచించారు. 'వైభవ్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి. ఒత్తిడి లేకుండా సహజ ఆట ఆడేలా ప్రోత్సహించాలి. సరైన మార్గదర్శకత్వం లభిస్తే భారత క్రికెట్‌కు అసాధారణ ఆటగాడిగా ఎదుగుతాడు' అని పేర్కొన్నారు. వైభవ్‌ను ఇంగ్లాండ్ సిరీస్‌కు జట్టుతో తీసుకెళ్లడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. 'తుది జట్టులో చోటు లేకపోయినా అంతర్జాతీయ క్రికెట్ వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం ముందున్నారు. కాబట్టి వైభవ్‌పై తొందరపడాల్సిన అవసరం లేదు' అన్నారు.

సచిన్ దేవుడు.. వైభవ్ దేవుడి కుమారుడు:

వైభవ్‌ను సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సచిన్‌తో ఎలాంటి పోలికలు అవసరం లేదు. సచిన్ క్రికెట్ దేవుడు. వైభవ్ సూర్యవంశీని నేను దేవుడి కుమారుడిగా నేను పిలుస్తాను. సచిన్ స్థాయికి ఎవరూ చేరలేరు. కానీ వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉంది. అతని బ్యాట్ స్వింగ్, రిస్ట్ వర్క్, షాట్ సెలెక్షన్ అద్భుతం' అని అన్నారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెరీర్‌పై కూడా శ్రీకాంత్ స్పందించారు. 'భారత క్రికెట్‌కు కోహ్లీ చేసిన సేవలు అపారమైనవి. అతడు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాతే వీడ్కోలు చెప్పి ఉంటే బాగుండేది. కోహ్లీకి రాజసంగా వీడ్కోలు ఇవ్వాల్సింది. కానీ అది జరగలేదు' అని అభిప్రాయపడ్డారు.

2027 ప్రపంచకప్‌లో రోహిత్ ఉండాలి:

రోహిత్ శర్మ భవిష్యత్తుపై కూడా శ్రీకాంత్ తన అభిప్రాయం వెల్లడించారు. 'రోహిత్ ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వన్డే ఓపెనర్లలో ఒకడు. అతడు ఫిట్‌గా ఉండి పరుగులు చేస్తే 2027 ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడాలి' అని అన్నారు. వైభవ్ సూర్యవంశీపై శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యువ బ్యాటర్‌పై ఉన్న అంచనాలు మరింత పెరిగినా, అతడిని ఒత్తిడికి గురి చేయకుండా సహజంగా ఎదగనివ్వాలని మాజీ కెప్టెన్ సూచించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story