Vaibhav Sooryavanshi: వేట మొదలెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒకేసారి 230 స్థానాలు పైకి, టాప్ -50లో అడుగు!
Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi surges 230 places in ICC T20I Rankings.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకుల్లో వేట మొదలుపెట్టాడు.
Vaibhav Sooryavanshi: వేట మొదలెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒకేసారి 230 స్థానాలు పైకి, టాప్ -50లో అడుగు!
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకుల్లో వేట మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన బుడ్డోడు.. ఆ టీ20 సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు. జింబాబ్వే సిరీస్‌లో మాత్రం చెలరేగిపోయాడు. మొదటి టీ20లో 50, రెండో టీ20లో 20, మూడో టీ20లో 81 రన్స్ చేశాడు. మూడు టీ20ల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో వైభవ్ దూసుకొచ్చాడు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలను ఎగబాకాడు. దీంతో అనతికాలంలోనే బుడ్డోడు టాప్ -50లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 536 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. 48వ స్థానంలో ఉన్నాడు. ర్యాంకింగ్స్‌లో వేట మొదలెట్టిన వైభవ్.. తన ప్రదర్శనతో దూసుకురావడానికి సిద్దమయ్యాడు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 910 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇషాన్ కొన్ని రేటింగ్ కోల్పోయాడు. పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాద ఫర్హాన్ 848 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్నాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా.. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
టీ20 బౌలర్ల విభాగంలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమైన వరుణ్ చక్రవర్తి (663) మూడు స్థానాలు కోల్పోయినా టాప్-10లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ నుంచి టాప్ -10లో ఉన్న ఒకే ఒక్క బౌలర్ వరుణ్ మాత్రమే. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు స్థానాలను కోల్పోయాడు. ప్రస్తుతం అతడు 17వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి ప్రపంచ నంబర్-1 స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి డారిల్ మిచెల్ నంబర్-1 ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో గిల్ మళ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవల వెస్టిండీస్-న్యూజిలాండ్ సిరీస్ అనంతరం ర్యాంకింగ్స్‌లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ (767), రోహిత్ శర్మ (758) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
వన్డే బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్కరూ కూడా లేరు. కుల్దీప్ యాదవ్ (596) 11వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, పేసర్ జేడెన్ సీల్స్ మెరుగైన ర్యాంకులు సాధించగా.. పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అబ్బాస్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. వన్డే, టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. టీ20ల్లో ఇంగ్లండ్ (268), భారత్ (268) మధ్య తీవ్ర పోటీ ఉంది. టెస్టుల్లో మాత్రం నాలుగో ర్యాంకులో ఉంది.




