Vaibhav Sooryavanshi: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్.. బౌలర్ ఎవరైనా బాదుడే.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi on Facing Hazlewood: జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి టాప్ బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు భయం అనిపించదా అన్న ప్రశ్నకు వైభవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీలు బాదుతూ రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నైపై 15 బంతుల్లో ఫిఫ్టీ చేసిన వైభవ్.. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కూడా మెరుపు అర్ధ శతకం బాదాడు. 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. మొన్న ముంబైపై జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సిక్సులు బాదిన వైభవ్.. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌నూ కూడా వదల్లేదు. భువీ, హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీలు, సిక్సులు సునాయాసంగా బాదాడు. అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మ్యాచ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్భయంగా ఎలా ఆడతావనే ప్రశ్నకు ఎంతో వినమ్రంగా సమాధానం ఇచ్చాడు.
తాను ఏ బౌలర్ బౌలింగ్ వేస్తున్నాడో చూడనని.. కేవలం బంతి పైనే దృష్టిపెడతానని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ఈరోజు కేక్ కట్ చేస్తారా అని అడిగితే వైభవ్ చాలా సింపుల్‌గా స్పందించాడు. 'లేదు సర్, అలాంటిదేమీ లేదు. రేపు ఉదయం ఫ్లైట్ ఉంది. కాబట్టి ఈ రోజు త్వరగా నిద్రపోవాలి. విజయాన్ని సెలబ్రేట్ చేయడం కంటే తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావడమే ముఖ్యం' అని చెప్పాడు. బ్యాటింగ్‌లో బెదురు లేకుండా ఆడుతున్నావా? అని అడిగితే.. 'ప్రాక్టీస్‌లో ఎలా ఆడుతానో మ్యాచ్‌లో కూడా అలానే ఆడుతా. అదనంగా ఏమీ ట్రై చేయను. నా నేచురల్ గేమ్ ఆడుతా' అని చెప్పాడు.
జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి టాప్ బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు భయం అనిపించదా అన్న ప్రశ్నకు వైభవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'మనసులో ఎవరు బౌలింగ్ చేస్తున్నారో ఉంటుంది. కానీ నేను బౌలర్‌ను కాకుండా బంతిని చూసి ఆడతాను. అదనపు ఒత్తిడికి గురికాను. బంతి ఎటువైపు వస్తే ఆ దిశగా ఆడుతూ నా ఆటను కొనసాగిస్తాను. నాన్న, నా కోచ్‌లు, అలాగే ఇక్కడ నా గార్డియన్ రోమి సర్ ఎప్పుడూ ఒకే విషయం చెబుతుంటారు. ఈ ప్రయాణం చాలా పెద్దది, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. కాబట్టి ప్రాసెస్‌పై దృష్టి పెట్టాలి అంటుంటారు' అని తెలిపాడు.
అవుట్ అయిన తర్వాత ఎందుకు నిరాశగా కనిపించావని అడిగితే.. 'నేను క్రీజ్‌లో ఉంటే ఇంకో 10-20 పరుగులు చేసేవాడిని. చేజింగ్‌లో మ్యాచ్‌ను ముందే ముగించేవాళ్లం. లూజ్ షాట్ ఆడి అవుట్ అయితే జట్టుకు నష్టం. అందుకే కొంచెం బాధగా అనిపించింది' అని వైభవ్ సూర్యవంశీ వెల్లడించాడు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ఇది వైభవ్‌కు రెండోసారి. వైభవ్ కేవలం టాలెంట్ ఉన్న ప్లేయర్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ, ఫోకస్, టీమ్ పట్ల నిబద్ధత ఉన్న క్రికెటర్ అని అతడి వ్యాఖ్యలు చెబుతున్నాయి.




