Vaibhav Sooryavanshi: గత నాలుగు నెలల్లో ఎన్నో ఒడిదుడుకులు.. ఆసక్తికర విషయాలు చెప్పిన వైభవ్!

Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi reflects on the ups and downs of his India career. వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులపై తొలిసారి స్పందించాడు.

Rishvik
Published on: 22 July 2026 6:23 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: గత నాలుగు నెలల్లో ఎన్నో ఒడిదుడుకులు.. ఆసక్తికర విషయాలు చెప్పిన వైభవ్!

Vaibhav Sooryavanshi: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులపై తొలిసారి స్పందించాడు. గత నాలుగు నెలల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. తన ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదని చెప్పాడు. ఇవన్నీ క్రికెట్‌లో భాగమే అని.. అన్నింటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపాడు. భారత జట్టు కోసం వంద శాతం కృషి చేయడమే తన లక్ష్యమని బుడ్డోడు స్పష్టం చేశాడు. గురువారం (జూలై 23) నుంచి హరారే వేదికగా ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వేపై సత్తా చాటాలని వైభవ్ ఉత్సాహంగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం రాకపోయినా.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దాంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే మూడు మ్యాచ్‌ల్లో బుడ్డోడు అంచనాలను అందుకోలేకపోయారు. దీంతో చివరి టీ20లో అతడిని తప్పించి సంజు శాంసన్‌కు భారత జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది.

మూడు ఇన్నింగ్స్‌ల అనంతరం వైభవ్‌ను జట్టు నుంచి తప్పించడం అప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు మాజీ క్రికెటర్లు కూడా టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వైభవ్ మాట్లాడుతూ.. 'గత నాలుగు నెలల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ ఇవన్నీ క్రికెట్‌లో భాగమే. ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. నేను మాత్రం నా ప్రక్రియను నమ్ముకుని జట్టు కోసం నా వంతు 100 శాతం కృషి చేస్తాను. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యా. కోచ్‌లు, సహచర ఆటగాళ్ల మద్దతు నాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. నాకు అవసరమైన ప్రతి మార్గదర్శకత్వాన్ని కోచ్‌లు అందిస్తున్నారు. ఏ విధమైన ప్రాక్టీస్ కావాలన్నా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నాకు మంచి ఆత్మవిశ్వాసం ఉంది. నా ఆటపై పూర్తి నమ్మకం ఉంది' అని బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

హరారే మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని వైభవ్ గుర్తు చేసుకున్నాడు. ఇదే వేదికపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు బాది భారత్‌కు బుడ్డోడు టైటిల్ అందించాడు. 'ఈ మైదానం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాలుగు నెలల క్రితమే ఇక్కడ ప్రపంచ కప్ గెలిచాం. ఇప్పుడు అదే మైదానంలో సీనియర్ జట్టుతో భారత జెర్సీ ధరించి ఆడటం మరింత ప్రత్యేకమైన అనుభూతి' అని చెప్పాడు. మొదటి టీ20కి ముందు వైభవ్ బీసీసీఐ టీవీలో మాట్లాడాడు.

జింబాబ్వే పిచ్‌లు, అక్కడి పరిస్థితులపై తనకు ఇప్పటికే మంచి అవగాహన ఉందని వైభవ్ తెలిపాడు. అండర్-19 ప్రపంచ కప్ సందర్భంగా నేర్చుకున్న విషయాలను ఇప్పుడు సీనియర్ జట్టులో ఉపయోగించాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. 'ఇప్పటివరకు చేసిన ప్రాక్టీస్‌పై నమ్మకం ఉంది. నా సహజమైన ఆటనే కొనసాగిస్తాను. జట్టుకు ఎంతవరకు ఉపయోగపడగలనో అంతవరకు నా వంతు సహకారం అందించడానికి ప్రయత్నిస్తాను. మంచి ఇన్నింగ్స్ ఆడుతానని నాకు నమ్మకం ఉంది' అని వైభవ్ సూర్యవంశీ ధీమా వ్యక్తం చేశాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story