Vaibhav Sooryavanshi: సూర్యవంశీ తప్పేం లేదు.. బుడ్డోడి కోపానికి అసలు కారణం ఇదే!

Vaibhav Sooryavanshi: ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన గొడవలో వైభవ్‌ సూర్యవంశీ తప్పేం లేదు.

Rishvik
Published on: 16 Jun 2026 6:00 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: సూర్యవంశీ తప్పేం లేదు.. బుడ్డోడి కోపానికి అసలు కారణం ఇదే!

Vaibhav Sooryavanshi: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా.. వివాదం కారణంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన మాటల యుద్ధం, తోపులాట క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ వివాదంలో ప్రధానంగా 15 ఏళ్ల భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్లు ఉన్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక లంక ప్లేయర్ చేసిన వ్యాఖ్యలే ఈ గొడవకు కారణమయ్యాయి.

మ్యాచ్ అయిపోయింది.. ఇక ఇంటికి వెళ్లు:

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌లో శ్రీలంక విజయం తర్వాత లంక ఆటగాడు విశేన్ హలంబాగే నేరుగా వైభవ్ సూర్యవంశీ వద్దకు వెళ్లి.. 'మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లు' అంటూ ఎగతాళిగా అన్నాడు. ఈ మాటలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వైభవ్.. హలంబాగేకి గట్టిగా బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది.ఇది తోపులాట వరకు వెళ్లింది. పరిస్థితి చేయి దాటకముందే మ్యాచ్ అంపైర్లు, అక్కడున్న లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.

ఐసీసీ) జోక్యం చేసుకోదు కానీ:

సాధారణంగా 'ఎ' జట్ల మ్యాచ్‌లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జోక్యం చేసుకోదు. కానీ ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.12 కిందికి వస్తుంది. ఈ నిబంధన ప్రకారం ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే మరో ఆటగాడిని నెట్టడం, భుజంతో ఢీకొట్టడం వంటి చర్యలు తప్పుగా పరిగణించబడతాయి. సంఘటన తీవ్రత, ఉద్దేశ్యం, ఎవరైనా గాయపడ్డారా వంటి అంశాలను పరిశీలించి మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే.. మ్యాచ్ రిఫరీ కేవలం హెచ్చరికతో సరిపెడతారా లేదా డీమరిట్ పాయింట్లు, జరిమానా వంటివి విధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

లంక డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చ:

మైదానంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనపై మ్యాచ్ అనంతరం శ్రీలంక-ఎ డ్రెస్సింగ్ రూమ్‌లో సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. స్టేడియంలో వెలుతురు సరిగ్గా లేనప్పటికీ మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడం, ఆపై తమ ఆటగాడు ప్రవర్తించిన తీరుపై లంక జట్టులోని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత జట్టుకు అధికారికంగా క్షమాపణలు చెబితే బాగుంటుందని కొందరు లంక సభ్యులు మేనేజ్‌మెంట్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

అసలు సూపర్ ఓవర్ జరగడమే తప్పు:

ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ నిర్వహణ వెనుక మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. నిర్ణీత 50 ఓవర్లలో స్కోర్లు సమం కాగానే.. స్టేడియంలో బ్యాడ్ లైట్ (వెలుతురు లేకపోవడం) కారణంగా మ్యాచ్‌ను ముగించాలని శ్రీలంక జట్టు భావించింది. కానీ భారత కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం అంపైర్లతో గట్టిగా వాదించి.. కచ్చితంగా సూపర్ ఓవర్ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాడు. భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో వెలుతురు మరింత తగ్గితే ఆటను నిలిపివేస్తామనే నిబంధనతో అంపైర్లు ప్రగీత్ రాంబుక్‌వెల్లా, శాంత ఫొన్సెకా సూపర్ ఓవర్‌కు అంగీకరించారు. అయితే లైటింగ్ దారుణంగా పడిపోయినప్పటికీ అంపైర్లు ఆటను ఆపకుండా అలాగే కొనసాగించారు. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు స్పందిస్తూ.. అసలు ఆ పరిస్థితుల్లో సూపర్ ఓవర్ నిర్వహించడమే తప్పు అని అసహనం వ్యక్తం చేశారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story