Vaibhav Sooryavanshi: నేను తక్కువకు అమ్ముడుపోయాను, చాలా బాధేసింది.. వైభవ్ సంచలన వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi on His IPL Price. భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.
Vaibhav Sooryavanshi: నేను తక్కువకు అమ్ముడుపోయాను, చాలా బాధేసింది.. వైభవ్ సంచలన వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడంతో.. బుడ్డోడు లీగ్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అమ్ముడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025, 2026లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఇప్పుడు స్టార్ అయ్యాడు. అయితే తాజాగా మొదటిసారి తన ఐపీఎల్ ధరపై వైభవ్ స్పందించాడు. అంత పెద్ద మొత్తానికి అమ్ముడైనప్పటికీ తాను పూర్తిగా సంతోషంగా లేనని వెల్లడించాడు.
రెండు జట్లే ఎందుకు బిడ్ చేశాయి?:
రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. వేలం రోజున తన మనసులో ఉన్న ఆలోచనను పంచుకున్నాడు. 'నిజం చెప్పాలంటే.. నేను ఎంపికైనప్పుడు నా కోసం కేవలం రెండు జట్లే ఎందుకు బిడ్ చేశాయి? అని అనుకున్నాను. నేను బాగా ఆడాను, ట్రయల్స్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాను. మరిన్ని జట్లు ఆసక్తి చూపుతాయని భావించాను. కానీ అలా జరగలేదు. అప్పుడు కాస్త నిరాశ చెందా' అని తెలిపాడు. వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడగా.. చివరకు ఆర్ఆర్ అతడిని దక్కించుకుంది.
ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది:
కాలక్రమేణా రాజస్థాన్ రాయల్స్ కుటుంబంలో భాగమైన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని వైభవ్ చెప్పాడు. 'గత ఏడాదిన్నర కాలంగా ఈ జట్టుతో ఉన్నాను. అందుకు ఆ దేవుడికి వెయ్యిసార్లు కృతజ్ఞతలు చెప్పాను. నన్ను రాజస్థాన్ రాయల్స్ వంటి అద్భుత ఫ్రాంచైజీకి తీసుకువచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. జట్టులోని కోచ్‌లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లు, ఫిజియోలు, ట్రైనర్లు అందరూ కుటుంబ సభ్యుల్లా నన్ను చూసుకుంటారు. ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. మన భావాలను పంచుకోవచ్చు. ఈ ఫ్రాంచైజీలో చేరిన తర్వాత నాకు లభించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సీనియర్ ఆటగాళ్లు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తుంటారు. ఏది మంచిదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతుంటారు. వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను' అని చెప్పాడు.
ఐపీఎల్ 2026లో అసాధారణ ప్రతిభ:
ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసిన వైభవ్.. తొలి బంతికే సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. తన మూడో మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లో శతకం సాధించి అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026లో అయితే మరింత విధ్వంసకరంగా ఆడి లీగ్‌ను శాసించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 237 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (ఎంవీపీ) అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఈ యువ సంచలనం.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా మారుతాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు విశ్వసిస్తున్నారు.




