Vaibhav Sooryavanshi: సూర్యవంశీ శుభవార్త.. బుడ్డోడికి భారత జట్టులో ఛాన్స్!

Vaibhav Sooryavanshi: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించే అవకాశాలు ఉన్నాయి.

Rishvik
Published on: 4 Jun 2026 6:23 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: సూర్యవంశీ శుభవార్త.. బుడ్డోడికి భారత జట్టులో ఛాన్స్!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియా జెర్సీ ధరించే అవకాశాలు ఉన్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకునేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వైభవ్ సూర్యవంశీని భారత టీ20 జట్టులోకి త్వరగా తీసుకురావడంపై చర్చలు చేస్తోంది. త్వరలో ఐర్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లేదా ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుడ్డోడు అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. టీ20ల్లో సత్తా చాటితే.. త్వరలోనే టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో వైభవ్ వన్డే క్రికెట్ ఆడే అవకాశాలు లేకపోలేదు. వన్డే ప్రపంచ కప్ 2027పై బీసీసీఐ ఇక నుంచి ఫోకస్ చేయనుంది. ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ 237గా ఉండటం విశేషం. ఈ సంచలన ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (ఎంవీపీ) అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత సీజన్లలో ఒకటిగా అతడి ప్రదర్శనను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 2016లో విరాట్ కోహ్లీ 973 రన్స్ చేసిన సీజన్ కంటే.. ఇదే అత్యుత్తమం అని అంటున్నారు. మరి అంతలా ఈ బిహారీ కుర్రాడు మాయ చేశాడు.

ఇప్పటికే భారత టీ20 జట్టులో స్టార్ ఆటగాళ్లతో పోటీ ఉన్నప్పటికీ.. వైభవ్ ప్రదర్శనను బీసీసీఐ సెలెక్టర్లు విస్మరించడం కష్టమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. యువ వయసులోనే ఒత్తిడిని తట్టుకుని నిలకడగా పరుగులు చేయడం అతడి ప్రత్యేకతగా నిలిచింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కూడా టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లను ఆర్సీబీకి అందించిన పాటిదార్.. ఐపీఎల్ 2026లో 501 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దాదాపు 193 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన అతడు మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అంశాలపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించే సమయంలో వైభవ్ సూర్యవంశీ, రజత్ పాటిదార్‌ల భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story