Vaibhav Sooryavanshi: ఐపీఎల్ కాదు.. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్.. వైభవ్‌కు అలీ చురకలు!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ క్రికెట్‌లో సరైన ఆరంభం దక్కలేదు.

Rishvik
Published on: 11 July 2026 7:00 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ కాదు.. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్.. వైభవ్‌కు అలీ చురకలు!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ క్రికెట్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారించిన బుడ్డోడు.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం తేలిపోతున్నాడు. దూకుడుగా ఆడినా.. ఐపీఎల్ మాదిరి భారీ ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌బౌలింగ్‌లో వైభవ్ తేలిపోతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఆర్చర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ బలహీనతను గుర్తించిన జోఫ్రా ఆర్చర్.. షార్ట్ బాల్స్‌తో బుడ్డోడిని ఇబ్బంది పెడుతున్నాడు. మూడో టీ20లో ఆర్చర్ వేసిన షార్ట్ బాల్ వైభవ్ గ్లవ్స్‌ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. నాలుగో టీ20లోనూ అదే వ్యూహాన్ని అమలు చేసిన ఆర్చర్.. షార్ట్ బాల్‌తో వైభవ్‌ను మరోసారి బోల్తా కొట్టించాడు. బుడ్డోడు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. టాప్ ఎడ్జ్ అయి క్యాచ్ ఔట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌లో సహచరులైన ఆర్చర్, వైభవ్ మధ్య జరుగుతున్న ఈ పోరుపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, మాజీ ఆర్సీబీ ఆటగాడు మొయిన్ అలీ స్పందించాడు. ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ నెట్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌ను వైభవ్ చితక్కొట్టాడని తాను చాలా కథనాలు విన్నానని చెప్పాడు. అయితే నెట్స్‌లో ఆడటం, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడటం పూర్తిగా భిన్నమని అలీ పేర్కొన్నాడు.

‘టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఆర్చర్ బౌలింగ్ నాకు చాలా నచ్చింది. ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఓ విషయం చూశాను. నెట్స్‌లో ఆర్చర్ బౌలింగ్‌ను వైభవ్ పలుమార్లు చితక్కొట్టాడని పేర్కొన్నారు. కానీ వైభవ్‌ను ఔట్ చేసేందుకు ఆర్చర్ అద్భుతమైన బౌన్సర్ వేశాడు. వైభవ్ అద్భుతమైన బ్యాటర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడి సామర్థ్యాన్ని నేను తక్కువ చేయడం లేదు కానీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇది ఐపీఎల్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది' అని ‘బియర్డ్ బిఫోర్ వికెట్’ పాడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో అవకాశం దక్కింది. రెండో టీ20లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్.. 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ తరఫున వైభవ్ 776 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లను బుడ్డోడు వణికించాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే తొలిసారి భారత జట్టులో అతడికి చోటు దక్కింది.

అయితే ఐపీఎల్‌ 2026లో విధ్వంసం సృష్టించిన వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మాత్రం పెను సవాల్ విసురుతోంది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ తన అనుభవంతో బుడ్డోడి బలహీనతను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పటికే శ్రేయాస్ సేన 0-3తో సిరీస్‌ను కోల్పోయింది. ఐదో టీ20లో విజయం సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు యాజమాన్యం సహా అభిమానులు ఆశిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story