Vaibhav Sooryavanshi: పాకిస్థాన్ విశ్లేషకుడికి బుడ్డోడు ఘాటు రిప్లై!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆటను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.

Rishvik
Published on: 29 April 2026 7:04 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: పాకిస్థాన్ విశ్లేషకుడికి బుడ్డోడు ఘాటు రిప్లై!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా.. క్రీజులోకి వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు.

కేవలం 9 మ్యాచ్‌లలోనే 400కు పైగా పరుగులు చేసి 'ఆరెంజ్ క్యాప్' దక్కించుకున్నాడు. 15 ఏళ్ల వైభవ్ అద్భుత స్ట్రైక్‌రేట్‌తో (238.09) బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్అర్ధదీప్ సింగ్, లాకి ఫెర్గుసన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా అతడు అలవోకగా ఎదుర్కొంటుండటం విశేషం.

వైభవ్ సూర్యవంశీ ఆటను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. అయితే బుడ్డోడి ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్‌ ఉండొచ్చంటూ నోరుపారేసుకున్నాడు. 'ఈ బాలుడి బ్యాట్‌లో ఏఐ చిప్ పెట్టారో ఏమో.

డోపింగ్ టెస్టుల్లా ఆ బ్యాట్‌ను ల్యాబ్‌కి పంపాలి. వైభవ్ అసలు నిజమైన ఆటగాడిలా కనిపించడం లేదు' అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు కొన్నిసార్లు స్లోగా ఆడుతున్నాడు అంటూ.. స్ట్రైక్‌రేట్ 300 ఉండాలి అని వ్యంవంగా అనడం మరింత వైరల్ అయ్యింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం ఈ విమర్శలకు బుడ్డోడు గట్టిగానే బదులిచ్చాడు.

'దేవుడే నా బ్యాట్‌లో ఏదో పెట్టాడు. నీ బ్యాట్‌లో ఏదో ఇస్తున్నానని పైనుంచి భగవంతుడు ముందే చెప్పాడు. అదే బ్యాట్‌ను నేను ఉపయోగిస్తున్నా' అంటూ వైభవ్ సూర్యవంశీ రిప్లై ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బుడ్డోడి సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రికార్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. కేవలం 167 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రస్సెల్ (188 బంతులు, 2019) పేరిట ఉండేది. అతని తర్వాత అభిషేక్ శర్మ (195 బంతులు, 2024), నికోలస్ పూరన్ (197 బంతులు, 2025), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (200 బంతులు, 2014) ఉన్నారు.

ఇటీవల పంజాబ్ కింగ్స్‌పై వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన దూకుడును చూపించాడు. ఇప్పుడు బుడ్డోడు ఐపీఎల్ 2026లో అత్యంత హాట్ టాపిక్‌గా మారాడు. అతడి బ్యాటింగ్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి ప్రభావం చూపించడం అతడి ప్రతిభకు నిదర్శనం. ఈ ఫామ్ కొనసాగితే భవిష్యత్తులో భారత క్రికెట్‌కు అతడు ఒక పెద్ద స్టార్ అవడం ఖాయం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story