Vaibhav Sooryavanshi: మళ్లీ అదే బంతికి ఔటైన వైభవ్ సూర్యవంశీ.. బుడ్డోడి బలహీనత బౌలర్లకు తెలిసిపోయిందా?
Vaibhav Sooryavanshi Weakness Exposed. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బలహీనత మరోసారి బయటపడింది.
Vaibhav Sooryavanshi: మళ్లీ అదే బంతికి ఔటైన వైభవ్ సూర్యవంశీ.. బుడ్డోడి బలహీనత బౌలర్లకు తెలిసిపోయిందా?
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. అదే సమయంలో అతని బలహీనత మరోసారి బయటపడింది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ (ఇండియా-ఏ, అఫ్గానిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ)లో భాగంగా అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 22 బంతుల్లో 44 పరుగులు చేసి మెరిశాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో ఆఫ్‌స్టంప్ బయటకు వచ్చిన బౌన్సర్‌కు బుడ్డోడు వికెట్ కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోసారి షార్ట్ బాల్‌కు బలి:
ట్రై సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఏపై 14 పరుగులకే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ.. అఫ్గానిస్తాన్-ఏపై మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే అఫ్గాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. తొమ్మిది ఫోర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కవర్ డ్రైవ్‌లు, టైమింగ్‌తో ఆడిన షాట్లు అతని క్లాస్‌ను మరోసారి చాటిచెప్పాయి. అయితే మంచి టచ్‌లో కనిపించిన వైభవ్.. మరోసారి షార్ట్ బాల్‌కు బలయ్యాడు. అఫ్గాన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ వేసిన ఆఫ్‌స్టంప్ బయటి బౌన్సర్‌ను షాట్‌గా మార్చే ప్రయత్నంలో ఎడ్జ్ అయిన బంతి వికెట్ కీపర్ మహ్మద్ ఇషాక్ చేతిలో పడింది. ఈ మ్యాచ్‌లో అహ్మద్‌జాయ్ ఐదు వికెట్లు (5/68) పడగొట్టి అఫ్గానిస్తాన్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.
బౌన్సర్‌లకు అవుట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు:
వైభవ్ సూర్యవంశీ బౌన్సర్‌లకు అవుట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2026 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఆఫ్‌స్టంప్ బయటకు షార్ట్ బాల్స్ వేస్తూ.. అతడిని ఒత్తిడిలోకి నెట్టారు. ప్రఫుల్ హింగే మొదటి బంతికే బుడ్డోడిని అవుట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు అఫ్గానిస్తాన్-ఏ బౌలర్లు కూడా అదే ప్లాన్‌ను అమలు చేయడంతో.. వైభవ్ మరోసారి బౌన్సర్ వ్యూహానికి బలయ్యాడు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్‌లో విజయవంతం కావాలంటే.. బౌన్సర్‌లను ఎదుర్కొనే టెక్నిక్‌ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే 15 ఏళ్ల వయసులోనే ఇలాంటి స్థాయిలో బ్యాటింగ్ చేయడం, తన లోపాలను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉండటం వైభవ్‌కు పెద్ద ప్లస్‌గా భావిస్తున్నారు.
వైభవ్ బ్యాటింగ్‌లో మరో కోణం:
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో మరో కోణం కూడా కనిపించింది. తాను కేవలం భారీ షాట్లకే పరిమితం కాదని.. అవసరం అనుకుంటే సింగిల్స్ కూడా తీస్తానని నిరూపించాడు. ఆఫ్ఘన్ బౌలర్లు ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్లను పెంచినా.. అనవసరంగా షాట్లు ఆడకుండా గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలతో పాటు క్రీజులో పరుగెత్తుతూ రన్స్ సాధించాడు. ముఖ్యంగా కవర్ ప్రాంతంలో బుడ్డోడు ఆడిన కొన్ని షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ మ్యాచులో భారత-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (66), వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (84) అర్ధ సెంచరీలతో రాణించడంతో.. భారత్-ఏ 49 ఓవర్లలో 349/9 భారీ స్కోరు సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.




