Vaibhav Sooryavanshi: వారి పాద ధూళికి కూడా వైభవ్ సరిపోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బుడ్డోడి తండ్రి!
Vaibhav Sooryavanshi's Father Commments. భారత జట్టును బీసీసీఐ ప్రకటించే సమయంలో వైభవ్ టెన్షన్ పడ్డాడని అతడి తండ్రి సంజీవ్ వెల్లడించారు.
Vaibhav Sooryavanshi: వారి పాద ధూళికి కూడా వైభవ్ సరిపోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బుడ్డోడి తండ్రి!
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారాడు. ఐపీఎల్ ప్రదర్శనతో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. దాంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బుడ్డోడు బద్దలు కొట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా వైభవ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే సమయంలో వైభవ్ చాలా టెన్షన్ పడ్డాడని అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీ వెల్లడించారు. 'నాన్నా.. గుండె వేగంగా కొట్టుకుంటోంది' అని బుడ్డోడి చెప్పాడని తెలిపారు.
జట్టు ఎంపికకు ముందు టెన్షన్‌లో వైభవ్:
టీమిండియా ఎంపికకు ముందు రోజు వైభవ్ సూర్యవంశీ తనతో మాట్లాడిన విషయాన్ని సంజీవ్ సూర్యవంశీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో శిక్షణలో ఉన్న వైభవ్.. జట్టు ప్రకటనకు ముందు ఎంతో ఉత్కంఠకు గురయ్యాడని చెప్పారు. 'నిన్న రాత్రి వైభవ్ నాకు ఫోన్ చేసి.. ‘నాన్నా రేపు మధ్యాహ్నం 1 గంటకు భారత జట్టును ప్రకటించనున్నారు. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది’ అని చెప్పాడు. అప్పుడు నేను ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదు. నువ్వు అద్భుతంగా ఆడావు. నీకు మంచి జరుగుతుంది' అని ధైర్యం చెప్పాను' అని సంజీవ్ వెల్లడించారు. అనుకున్నట్టుగానే టీమిండియాలో వైభవ్‌కు చోటు దక్కిందని, ఇదంతా అతడి కష్టమే అని సంతోషం వ్యక్తం చేశారు.
సచిన్, బ్రాడ్‌మన్‌తో పోల్చొద్దు:
వైభవ్‌ను ఇప్పటికే సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పోలుస్తున్న నేపథ్యంలో సంజీవ్ సూర్యవంశీ స్పందించారు. 'వైభవ్‌ను సచిన్ లేదా బ్రాడ్‌మన్‌తో పోల్చడం సరైంది కాదు. వారు ఎన్నో సంవత్సరాల పాటు అత్యున్నత స్థాయిలో అద్భుత ప్రదర్శనలు చేశారు. ప్రస్తుతం వైభవ్ వారి పాద ధూళికి కూడా సరిపోడు. ఇవైభవ్ చాలా చిన్నోడు. దయచేసి లాంటి పోలికలు వద్దు' అని వినయంగా కోరారు. వైభవ్ ఎడమచేతి బ్యాటర్ కావడంతో తనకు ఎంతో ఇష్టమైన వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా వీడియోలను చిన్నప్పటి నుంచి చూపించేవాడినని సంజీవ్ తెలిపారు. లారా, యువరాజ్ సింగ్‌తో పాటు పలువురు దిగ్గజాల ఆటను వైభవ్ పరిశీలించాడని.. అయితే ఇప్పుడు అతడికి పూర్తిగా తనదైన శైలి ఏర్పడిందని చెప్పారు.
టీ20 మాత్రమే కాదు.. టెస్టులు కూడా ఇష్టం:
ఐపీఎల్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో పేరు తెచ్చుకున్న వైభవ్‌కు కేవలం టీ20లే ఇష్టమని అనుకోవద్దని సంజీవ్ సూర్యవంశీ అన్నారు. 'వైభవ్ మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని కోరుకుంటాడు. ఐపీఎల్‌లో అతడి దూకుడు అందరూ చూశారు. కానీ ఒక 50 ఓవర్ల మ్యాచ్‌లో 332 పరుగులు కూడా చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను కూడా అంతే ఇష్టపడతాడు' అని తెలిపారు. ప్రపంచ స్థాయి బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్‌లపై కూడా తొలి బంతికే సిక్సర్లు కొట్టిన వైభవ్ ధైర్యానికి కారణం ఏమిటని అడగగా.. అది పూర్తిగా అతడి సొంత వ్యూహమని చెప్పారు. 'చిన్నప్పుడు వైభవ్ పెద్దవాళ్లతో ఆడినప్పుడు ‘ఇతను చిన్న పిల్లవాడు’ అని ప్రత్యర్థులు తక్కువగా చూసేవారు. అప్పుడు నేను వారి జట్టులోని ప్రధాన బౌలర్‌ను చూపించేవాడిని. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆ బౌలర్‌పై సిక్సర్ కొట్టడానికి ప్రయత్నించేవాడు. ఆ బౌలర్‌ను కొడితే మిగతావాళ్లు మనపై ఆధిపత్యం చూపలేరు అనేది అతడి ఆలోచన. అదే అలవాటుగా మారింది' అని తెలిపారు.
తండ్రిగా ఇంకా తృప్తి లేదు:
వైభవ్ టీమిండియాలోకి ఎంపికైనప్పటికీ.. తండ్రిగా తనకు ఇంకా పెద్ద లక్ష్యాలే ఉన్నాయని సంజీవ్ అన్నారు. 'మా బీహార్ తల్లిదండ్రుల మనస్తత్వం అలాంటిదే. పిల్లలు ఎంత బాగా చేసినా ఇంకా కొంచెం మెరుగ్గా చేయాలని కోరుకుంటాం. వ్యక్తిగత పరుగుల కంటే జట్టు విజయమే ముఖ్యమని నేను ఎప్పుడూ చెబుతాను' అని పేర్కొన్నారు. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా క్రికెట్ ఆడుతున్నాడని సంజీవ్ తెలిపారు. అతడు కూడా మంచి ఆటగాడేనని, అయితే వైభవ్ మాత్రం ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన క్రికెటర్ అని చెప్పారు. కుడిచేతి బ్యాటర్ అయిన ఆశీర్వాద్ కూడా త్వరలోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంటాడని సంజీవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.




