కోపం పనికిరాదు.. కోచ్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే.. మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Aaron: Varun Aaron on Most Important Quality for Coach. మంచి కోచ్ కావాలంటే వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోవన్నాడు భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్.

Rishvik
Published on: 27 July 2026 7:18 PM IST
Varun Aaron
X

కోపం పనికిరాదు.. కోచ్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే.. మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Aaron: భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ తన కోచింగ్ విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోచింగ్, కామెంట్రీ రంగాల్లో బిజీగా ఉన్న ఆరోన్.. మంచి కోచ్ కావాలంటే వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోవన్నాడు. ముందుగా మరో మనిషికి సహాయం చేయాలనే మనస్తత్వం కోచ్‌కు ఉండాలని చెప్పాడు. జింబాబ్వే సిరీస్ ముగిసిన తర్వాత ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోచింగ్ ప్రయాణం, గాయాల నుంచి తిరిగి వచ్చిన అనుభవాల గురించి మాట్లాడాడు.

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు వరుణ్ ఆరోన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కోచింగ్ అంటే కేవలం టెక్నికల్ అంశాలు చెప్పడం కాదని స్పష్టం చేశాడు. 'కోచింగ్‌లో అత్యంత ముఖ్యమైన విషయం మరో మనిషికి సహాయం చేయాలనే తపన. ఆ లక్షణం లేకపోతే మీరు వ్యూహాల్లో ఎంత గొప్ప వారైనా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెక్నికల్, టాక్టికల్ నైపుణ్యాలు తర్వాతి విషయం. ముందుగా ఆటగాడిని అర్థం చేసుకుని అతడికి సహాయం చేయాలనే ఆలోచన ఉండాలి' అని వరుణ్ ఆరోన్ పేర్కొన్నాడు.

కామెంట్రీ రంగంలోకి రావడం కూడా అనుకోకుండా జరిగిందని ఆరోన్ వెల్లడించాడు. 'నేను రిటైర్మెంట్ ప్రకటించకముందే స్టార్ స్పోర్ట్స్ నుంచి ఐపీఎల్‌లో కామెంట్రీ చేసే అవకాశం వచ్చింది. ఆటగాడిగా ఉన్న సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని కాదు. కానీ కామెంటేటర్ అయిన తర్వాత గత రెండేళ్లలో ఎన్నో మ్యాచ్‌లు చూసి ఆటను మరో కోణంలో అర్థం చేసుకునే అవకాశం దక్కింది. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా అవకాశం కూడా సహజంగానే వచ్చింది.

నా కెరీర్లో ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీ, భారత మాజీ పేసర్ సుబ్రతో బెనర్జీల పాత్ర ఎంతో కీలకం. చిన్న వయసులో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో లిల్లీ వద్ద శిక్షణ పొందాను. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఫాస్ట్ బౌలింగ్ పట్ల అంకితభావాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత తిరిగి క్రికెట్‌లోకి రావడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు చూపించే అసాధారణ కోచ్' అని ప్రశంసించాడు.

గాయాలతో తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న అనుభవం కోచ్‌గా తనను మరింత సున్నితంగా మార్చిందని ఆరోన్ అభిప్రాయపడ్డాడు. 'ఏ ఆటగాడు కావాలనే విఫలం కావాలని కోరుకోడు. ప్రతి వైఫల్యానికి మానసికంగా, సాంకేతికంగా లేదా వ్యూహాత్మకంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కోచ్‌గా మన పని ఆటగాడిపై కోపం చూపించడం కాదు. అతడు ఎందుకు విఫలమయ్యాడో తెలుసుకుని, దానికి పరిష్కారం చూపించాలి.

అందుకు సానుభూతి, ఓర్పు, ఆసక్తి చాలా అవసరం' అని వివరించాడు. భారత జట్టు తరఫున తొమ్మిది టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడిన ఆరోన్.. తన అనుభవాలను ఇప్పుడు యువ బౌలర్లకు పంచుతూ కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. టెక్నిక్ కంటే ఆటగాడి మనసును అర్థం చేసుకోవడమే గొప్ప కోచ్ లక్షణమని ఆయన చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story