Vinesh Phogat: నన్ను ఆసియా క్రీడలకు దూరం చేసే కుట్ర.. డబ్ల్యూఎఫ్‌ఐపై వినేశ్ ఫొగాట్ ఫైర్!

Vinesh Phogat: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తనపై కుట్ర చేస్తోందని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 12 May 2026 11:30 AM IST
Vinesh Phogat
X

Vinesh Phogat: నన్ను ఆసియా క్రీడలకు దూరం చేసే కుట్ర.. డబ్ల్యూఎఫ్‌ఐపై వినేశ్ ఫొగాట్ ఫైర్!

Vinesh Phogat: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) తీరుపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2026 ఆసియా క్రీడల్లో తాను పాల్గొనకుండా అడ్డుకోవడమే సమాఖ్య ప్రధాన లక్ష్యమని ఆమె ఆరోపించారు. తాను మళ్లీ పతకాలు గెలుస్తాననే భయం వారిలో ఉందని, అందుకే తనపై అనర్హత వేటు వేస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనేందుకు వినేశ్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్తో ఆమె సమావేశమై తనపై ఉన్న అనర్హతను తొలగించాలని కోరారు.

తనకు నోటీసులు ఇచ్చి సమాధానం కోసం 14 రోజుల గడువు ఇచ్చారని, ఈ లోపు తనను పోటీ చేయనివ్వాలని ఆమె విన్నవించారు. అయితే, ఈ అభ్యర్థనను సంజయ్ సింగ్ తోసిపుచ్చారు. పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు పోటీకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఒక ఇంటర్వ్యూలో వినేశ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు తర్వాత తన జీవితంలో ఆనందం కోల్పోయానని, కానీ తన కుమారుడు క్రిధవ్ (Kridhav) తనలో మళ్లీ ఉత్సాహాన్ని నింపాడని చెప్పారు. ఈ వ్యవస్థపై పోరాడే శక్తి తన బిడ్డ వల్లే వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

"నేను మళ్లీ రింగులోకి వచ్చి పతకాలు సాధిస్తానని వారు భయపడుతున్నారు. నన్ను ఆసియా క్రీడల నుంచి తప్పించాలని, నేను రెజ్లింగ్ నుండి రిటైర్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. అందుకే సాంకేతిక కారణాలు చూపి నన్ను పక్కన పెడుతున్నారు" అని వినేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story