Virat Kohli: వరుస డకౌట్లపై కోహ్లీ జోక్స్.. పగలబడి నవ్వుకున్న ఆర్సీబీ ప్లేయర్స్!

Virat Kohli: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు.

Rishvik
Published on: 13 May 2026 6:44 PM IST
Virat Kohli
X

Virat Kohli: వరుస డకౌట్లపై కోహ్లీ జోక్స్.. పగలబడి నవ్వుకున్న ఆర్సీబీ ప్లేయర్స్!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌పై కింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే.. పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ తన ప్రత్యేక హాస్యంతో అభిమానులను, జట్టు సభ్యులను అలరిస్తూనే ఉన్నాడు. కోహ్లీకి సంబందించిన ఓ వీడియోను ఆర్సీబీ ప్రాంచైజీ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడే బాధ్యతను విరాట్ కోహ్లీకి అప్పగించారు. ఈ సందర్భంగా తన ఫామ్‌పై తానే సరదాగా జోక్ వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు.

‘ఈరోజు మ్యాచ్‌లో ఏదైనా చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ ఆండీ’ అంటూ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను ఉద్దేశించి అన్నాడు. దాంతో ఆర్సీబీ ప్లేయర్స్ ఒక్కసారిగా నవ్వులు పూయించారు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లక్నో, ముంబైపై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. తన నిరాశాజనక ఫామ్‌ను కూడా సరదాగా తీసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.

2028 సీజన్‌కు ముందు 37 ఏళ్ల విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టిపెట్టుకుంది. ఆర్సీబీకి కింగ్ కీలక ప్లేయర్. ఐపీఎల్ 2026లో బెంగళూరు తరఫున ఓపెనింగ్ బ్యాటర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వరుసగా రెండు గోల్డెన్ డక్‌లతో కాస్త ఫామ్ కోల్పోయినప్పటికీ.. 11 మ్యాచ్‌లలో 379 పరుగులు సాధించాడు. అతను 42.11 సగటు, 163.36 స్ట్రైక్ రేట్‌ను కొనసాగించాడు. ఆరెంజ్ క్యాప్ ప్రధాన పోటీదారుగా ఉన్నాడు. ఇటీవల తన కెరీర్‌లో 9000 ఐపీఎల్ పరుగులు, 800 ఫోర్లను కింగ్ అధిగమించాడు. గతేడాది ఆర్సీబీ కప్ కొట్టడంలో కోహ్లీదే కీలక పాత్ర.

ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ హీరోలుగా నిలిచారు. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబైని భువనేశ్వర్ తన అద్భుత బౌలింగ్‌తో కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో పాండ్యా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఆర్సీబీ ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించింది. 36 ఏళ్ల వయసులోనూ భువనేశ్వర్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story