Virat Kohli: మరో 203 పరుగులే.. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి సాధ్యమేనా?
Virat Kohli 203 runs away from 15000 run milestone in ODIs: ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
Virat Kohli: మరో 203 పరుగులే.. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి సాధ్యమేనా?
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 అనంతరం ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన కోహ్లీ.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో తిరిగి భారత జట్టులో చేరిన కింగ్.. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో ఆడుతున్నాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి రావడంతో కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 311 మ్యాచ్‌ల్లో 14,797 పరుగులు చేశాడు. ఇందులో 54 సెంచరీలు , 77 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ మరో 203 పరుగులు చేస్తే.. వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం కోహ్లీకి ఉంది. అయితే వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన కెరీర్‌లో 463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు బాదాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల రికార్డును అధిగమించాడు. అయితే పరుగుల విషయంలో మాత్రం ఇంకా 3,629 రన్స్ వెనుకబడి ఉన్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో సగటున 58.71 పరుగులు చేస్తున్నాడు. అదే సగటును కొనసాగించినా.. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడానికి మరో 62 ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన కింగ్.. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు మాత్రమే ఆడనున్నాడు. ఈ ఏడాది కాలంలో భారత్ ఆడబోయే వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ మెగా రికార్డును అధిగమించడం కోహ్లీకి అంత సులభం కాదనే చెప్పాలి. సచిన్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీకి దాదాపుగా ఈ రికార్డు అసాధ్యమనే చెప్పొచ్చు.
మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై మాజీ భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే 2011 వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 , టీ20 ప్రపంచకప్ 2026 వంటి అన్ని ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలిచిన కోహ్లీకి ఇంకా సాధించాల్సింది ఏముందని ప్రశ్నించాడు. అయితే వంద అంతర్జాతీయ సెంచరీల మైలురాయి కోహ్లీ లక్ష్యంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీ పరుగులు చేస్తూ మంచి ఫామ్‌లో ఉంటే విదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్ మరింత బలపడుతుంది. అతని ఉనికి జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని పార్థివ్ పటేల్ అన్నాడు.
వన్డే క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు 15 వేల పరుగుల మైలురాయికి అతడు చేరువలో ఉన్నాడు. ఈ ఘనత సాధించిన అనంతరం కింగ్ దృష్టి సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డుపైనే ఉండనుంది. అయితే ఆ మహా రికార్డును అధిగమించాలంటే.. కోహ్లీ మరికొంత కాలం వన్డే క్రికెట్‌లో నిలకడగా కొనసాగాల్సి ఉంటుంది. చూడాలి మరి కింగ్ ఆ రికార్డును అందుకుంటాడో లేదో.




