RCB vs GT Qualifier 1: మరో 43 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్!
Virat Kohli Eyes on IPL Record. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీ పైనే ఉంది.
RCB vs GT Qualifier 1: మరో 43 పరుగులే.. అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్!
RCB vs GT Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర సమరం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అందరి చూపు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఇప్పటికే అద్భుత ఫామ్‌లో ఉన్న కింగ్.. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన రికార్డుకు కేవలం 43 పరుగుల దూరంలో నిలిచాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లలో 557 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 50.64 సగటు, 163.82 స్ట్రైక్ రేట్‌తో కింగ్ రన్స్ చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో మరో 43 పరుగులు చేస్తే.. వరుసగా నాలుగు సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. కోహ్లీ ఇప్పటికే 2023, 2024, 2025 సీజన్లలో 600+ పరుగులు చేశాడు. ఇప్పుడు 2026లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ అరుదైన ఘనతకు చేరువయ్యాడు.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురే ఉన్నారు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 2011, 2012, 2013 సీజన్లలో ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ 2016, 2017, 2019 సీజన్లలో 600+ పరుగులు నమోదు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం పడడంతో 2018లో ఆడలేదు. కేఎల్ రాహుల్ 2020, 2021, 2022 సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు చేశాడు. అయితే వరుసగా నాలుగు సీజన్లలో ఈ ఫీట్ సాధించిన ఆటగాడు మాత్రం ఇప్పటివరకు లేడు.
ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. కీలక మ్యాచ్‌ల్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతూ.. అవసరమైనప్పుడు ఇన్నింగ్స్‌ను కూడా నిర్మించాడు. ఇప్పుడు క్వాలిఫయర్-1లో కాగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లాంటి టాప్ బౌలర్లను ఎదుర్కొంటూ కోహ్లీ ఈ భారీ రికార్డును అందుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ అభిమానులు మాత్రం మరోసారి ‘కింగ్’ నుంచి స్పెషల్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 43+ పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే అరుదైన మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు.
వరుసగా 600కు పైగా పరుగులు చేసిన ప్లేయర్స్:
విరాట్ కోహ్లీ (2023, 2024, 2025)
క్రిస్ గేల్ (2011, 2012, 2013)
డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019)
కేఎల్ రాహుల్ (2020, 2021, 2022)




