కోహ్లీ ఫ్యాన్స్‌కు షాక్.. గాయంతో మైదానానికి దూరం.. కింగ్ మళ్లీ ఎప్పుడు ఆడతారంటే?
Virat Kohli: ఇటీవలే ఐపీఎల్ ముగించుకుని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ ఆశ్రమాన్ని సందర్శించిన కోహ్లీ, పూర్తి ఉత్సాహంతో తదుపరి సిరీస్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురైంది.
కోహ్లీ ఫ్యాన్స్‌కు షాక్.. గాయంతో మైదానానికి దూరం.. కింగ్ మళ్లీ ఎప్పుడు ఆడతారంటే?
Virat Kohli: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పరుగుల వరద పారించిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గాయపడటం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ అదరగొడతాడని ఆశించిన అభిమానులకు ఈ వార్త బిగ్ షాకిచ్చింది. ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు చూద్దాం..
అఫ్గాన్ సిరీస్‌కు ముందే ఎదురుదెబ్బ..
ఇటీవలే ఐపీఎల్ ముగించుకుని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ కోహ్లీ, పూర్తి ఉత్సాహంతో తదుపరి సిరీస్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ అవాంతరం ఎదురైంది. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా ఆయన హ్యామ్‌స్ట్రింగ్ (తొడ కండరాల) గాయానికి గురికావడంతో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల్లోనూ ఆందోళన మొదలైంది.
జూన్ 13 నుంచి వన్డే సమరం.. గిల్ చేతికి పగ్గాలు..
చండీగఢ్‌లోని ముల్లాంపూర్ స్టేడియంలో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత జట్టు జూన్ 13 నుంచి 20 వరకు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టును ప్రకటించింది. సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్‌కు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రాబోయే 2027 ప్రపంచకప్ సన్నాహకాల దృష్ట్యా ఈ సిరీస్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. వికెట్ కీపర్లుగా కె.ఎల్. రాహుల్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కగా, ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు. అయితే రోహిత్, హార్దిక్ సిరీస్ ప్రారంభానికి ముందే తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది.
రెండు వారాల విశ్రాంతి..
వైద్యుల సమాచారం ప్రకారం, విరాట్ కోహ్లీ గాయం తీవ్రత పెద్దది కాకపోయినప్పటికీ, కండరాలపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు కనీసం రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కోహ్లీ ఫామ్ పరంగా ఎంతటి కీలక ఆటగాడో ఆయన గత ఐదు వన్డేల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. న్యూజిలాండ్‌పై 93 పరుగులు, దక్షిణాఫ్రికాపై వరుసగా 65 (నాటౌట్), 102, 135 పరుగులతో అద్భుతమైన సెంచరీలతో కదం తొక్కారు. ఇలాంటి నమ్మకమైన ఆటగాడు దూరం కావడం జట్టుకు పెద్ద లోటే.
మూడో వన్డేలో కింగ్ కోహ్లీ రీఎంట్రీ?
ప్రస్తుత సమాచారం ప్రకారం, కోహ్లీ రెండు వారాల విశ్రాంతి తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడో వన్డే మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ లోగా ఆయన స్థానంలో మూడో నంబర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వన్డేల్లో ఇషాన్ కిషన్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించడంతో పాటు, ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరం కావడం భారత క్రికెట్ ప్రేమికులకు చేదువార్తే అయినప్పటికీ, ఆయన త్వరగా కోలుకుని మూడో వన్డేలో బ్యాట్ పట్టి మళ్లీ పరుగుల వరద పారించాలని, టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థిస్తున్నారు.




