Virat Kohli-IPL 2026: ఐపీఎల్‌లో కోహ్లీని కొట్టేవాడే లేడు.. ప్రతి సీజన్‌లో కింగే, అన్ని రన్స్ ఎలా చేస్తున్నావయ్యా!

Virat Kohli-IPL 2026: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగతా వారి కంటే బిన్నం. ఓ ఐపీఎల్ సీజన్‌లో కాదు.. ప్రతి సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు భారీ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కింగ్ నిలిచాడు.

Rishvik
Published on: 15 March 2026 5:44 PM IST
Virat Kohli-IPL 2026
X

Virat Kohli-IPL 2026: ఐపీఎల్‌లో కోహ్లీని కొట్టేవాడే లేడు.. ప్రతి సీజన్‌లో కింగే, అన్ని రన్స్ ఎలా చేస్తున్నావయ్యా!

Virat Kohli-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్. ఐపీఎల్ ప్రతి సీజన్‌లో బ్యాటర్ల ప్రదర్శన ఎంతో కీలకం. కొన్ని సీజన్లలో ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించి రికార్డులు సృష్టించారు. ఓ సీజన్‌లో ఒక్కో బ్యాటర్ భారీగా రన్స్ చేస్తుంటారు. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు బిన్నం. ఓ సీజన్‌లో కాదు.. ప్రతి సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు భారీ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కింగ్ నిలిచాడు.

400కి పైగా పరుగులు:

ఒక ఐపీఎల్ సీజన్‌లో 400కి పైగా పరుగులు చేసిన స్టార్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ 11 సార్లు ఈ ఘనత సాధించాడు. కింగ్ తర్వాతి సురేష్ రైనా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ తలో 9 సార్లు 400+ పరుగులు చేశారు. అలాగే లోకేష్ రాహుల్ 7 సార్లు, ఏబీ డివిలియర్స్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తలో 6 సార్లు ఈ మైలురాయిని అందుకున్నారు. ఇక గౌతమ్ గంభీర్, క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్, సూర్యకుమార్ యాదవ్ తలా 5 సార్లు 400+ పరుగులు చేశారు.

500, 600కి పైగా పరుగులు:

500కి పైగా పరుగులు చేసిన సీజన్లలో కూడా విరాట్ కోహ్లీ ఆధిపత్యం కొనసాగింది. కోహ్లీ 8 సార్లు ఈ ఘనత సాధించగా.. డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ తలా 7 సార్లు 500+ పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 5 సార్లు ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక సురేష్ రైనా, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్, జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, రుతురాజ్ గైక్వాడ్ తలా 3 సార్లు 500+ పరుగులు సాధించారు. ఒక సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసిన సందర్భాల్లో కూడా కోహ్లీ ముందంజలో ఉన్నాడు. కోహ్లీ 5 సార్లు 600+ పరుగులు చేశాడు. లోకేష్ రాహుల్ 4 సార్లు ఈ మైలురాయిని అందుకోగా.. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ తలా 3 సార్లు ఈ ఘనత సాధించారు. ఇక ఫాఫ్ డు ప్లెసిస్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తలా 2 సార్లు 600+ పరుగులు చేశారు.

700, 800కి పైగా పరుగులు:

ఐపీఎల్ సీజన్‌లో 700కి పైగా పరుగులు చేయడం చాలా అరుదైన విషయం. ఈ ఘనతను కూడా విరాట్ కోహ్లీ అందుకున్నాడు. కింగ్ 2 సార్లు 700కి పైగా పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 2 సార్లు సాధించాడు. ఒక్కసారి మాత్రమే 700+ పరుగులు చేసిన ఆటగాళ్లలో మైకేల్ హస్సీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, ఫాఫ్ డు ప్లెసిస్, కేన్ విలియమ్సన్, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఒక ఐపీఎల్ సీజన్‌లో 800కి పైగా పరుగులు చేసిన రికార్డు కొద్దిమంది పేరుపై ఉంది. ఈ ఘనతను విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్ ఒక్కోసారి సాధించారు.

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు:

అయితే ఐపీఎల్ చరిత్రలో 900కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు మాత్రం విరాట్ కోహ్లీ మాత్రమే కావడం విశేషం. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్ చరిత్రలో కింగ్ కోహ్లీ ఎంత స్థిరంగా పరుగులు చేస్తున్నాడో స్పష్టంగా తెలుస్తోంది. ఇలా నిరంతర ప్రదర్శన చేయడం చాలా అరుదు. ఈ గణాంకాలు చూసి క్రికెట్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. 'ఐపీఎల్‌లో కోహ్లీని కొట్టేవాడే లేడు', 'ప్రతి సీజన్‌లో కింగే', 'అన్ని రన్స్ ఎలా చేస్తున్నావయ్యా కోహ్లీ' అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 కోసం కింగ్ సిద్దమవుతున్నాడు.

Rishvik

Rishvik

Next Story