Virat Kohli: కోహ్లీ మాస్టర్ ప్లాన్.. భువనేశ్వర్‌కు వికెట్.. వైరల్‌గా మారిన సెలబ్రేషన్!

Virat Kohli: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్రికెట్ మైండ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Rishvik
Published on: 18 May 2026 7:02 PM IST
Virat Kohli
X

Virat Kohli: కోహ్లీ మాస్టర్ ప్లాన్.. భువనేశ్వర్‌కు వికెట్.. వైరల్‌గా మారిన సెలబ్రేషన్!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్రికెట్ మైండ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో ధర్మశాల వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఇచ్చిన సలహాతో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ కీలక వికెట్‌ పడగొట్టాడు. దాంతో అభిమానులు కింగ్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య వికెట్ పడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పంజాబ్ కింగ్స్ 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ నుంచే ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్‌కు ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ ఓ సూచన చేశాడు. ప్రియాంశ్ శరీరానికి దగ్గరగా బంతి వేయాలని కోహ్లీ చెప్పాడు. వెంటనే భువీ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయగా.. ప్రియాంశ్ సరైన టైమింగ్ చేయలేక మిడ్‌వికెట్ వద్ద రొమారియో షెఫర్డ్‌కు సులభ క్యాచ్ ఇచ్చాడు.

వికెట్ పడగానే కోహ్లీ గట్టిగా సెలబ్రేట్ చేశాడు. భువనేశ్వర్‌ను హత్తుకుని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ రియాక్షన్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. మైదానంలోని స్టంప్ మైక్ ఆడియో క్లిప్స్ నెట్టింట లీక్ అవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. కింగ్ మాస్టర్ ప్లాన్‌కు ఫాన్స్ ఫిదా అయ్యారు.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 పరుగులు చేసి మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి మరో 60 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అయ్యర్ అయితే అజేయంగా 73 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పడిక్కల్ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో టిమ్ డేవిడ్ వేగంగా పరుగులు జోడించాడు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఓపెనింగ్ స్పెల్‌తో ప్రియాంశ్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (2) వికెట్లు తీసి పంజాబ్‌ను కుదేలు చేశాడు. అనంతరం రసిఖ్ సలామ్ దార్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్‌పై ఆర్సీబీ పట్టు సాధించింది. పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ 27 బంతుల్లో 56 పరుగులతో పోరాడాడు.

మార్కస్ స్టోయినిస్ 37 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులకే పరిమితమైంది. 23 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story