Kohli-ABD: ఏబీ ఈ కుర్రాడు చాలా స్పెషల్.. వైభవ్ సూర్యవంశీ ఆట చూస్తే మెంటలెక్కుతోంది!

Virat Kohli heaped praise on Vaibhav Sooryavanshi. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు.

Rishvik
Published on: 1 Jun 2026 6:27 PM IST
Kohli-ABD
X

Kohli-ABD: ఏబీ ఈ కుర్రాడు చాలా స్పెషల్.. వైభవ్ సూర్యవంశీ ఆట చూస్తే మెంటలెక్కుతోంది!

Kohli-ABD: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 776 పరుగులు సాధించి.. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో అతను ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు, బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నాడు. బుడ్డోడి ఆటకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించిన కింగ్.. బుడ్డోడి గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఏబీ స్వయంగా చెప్పాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ అందుకునేందుకు వేదికపైకి వచ్చిన సమయంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. ఫైనల్ సందర్భంగా బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్‌తో మాట్లాడిన డివిలియర్స్.. కోహ్లీ తనతో చెప్పిన మాటలను బయటపెట్టాడు. 'వైభవ్ ఆరెంజ్ క్యాప్ తీసుకునేందుకు స్టేజ్‌పైకి వెళ్తుండగా విరాట్ నా వైపు చూసి కనుబొమ్మలు ఎత్తి.. ఏబీ ఈ కుర్రాడు చాలా స్పెషల్. అతను నిజంగా అద్భుతంగా ఆడగలడు. కొన్ని షాట్స్ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పాడు. కోహ్లీ నోటి నుంచి అలాంటి మాటలు రావడం వైభవ్ ప్రతిభకు నిదర్శనం' అని డివిలియర్స్ తెలిపాడు.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లను వెనక్కి నెట్టి.. 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీజన్ మొత్తం దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్న వైభవ్.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు పలు వ్యక్తిగత అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్ 2026 ఫైనల్లో అజేయంగా 75 పరుగులు చేసిన కోహ్లీపై కూడా ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కోహ్లీకి బలమైన ఏరియాల్లో ఎక్కువగా బంతులు చేయడం పెద్ద తప్పిదమైందని అభిప్రాయపడ్డాడు.

'ఒక ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీని త్వరగా అవుట్ చేయకపోతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అతనికి ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో, ఛేజ్‌ను ఎలా నియంత్రించాలో బాగా తెలుసు. తొలి 20-30 పరుగుల సమయంలో గుజరాత్ బౌలర్లు అతని కాళ్ల వైపు ఎక్కువ బంతులు వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీకి అలాంటి ఆరంభం ఇస్తే అతను తప్పకుండా చెలరేగుతాడు. ఒకసారి అతను లయలోకి వస్తే ఆపడం చాలా కష్టం' అని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. ఆర్సీబీని వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కింగ్ కోహ్లీ వంటి దిగ్గజం నుంచి వచ్చిన ప్రశంసలు వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story