Virat Kohli: 37 ఏళ్ల వయసులోనూ మారాల్సిందే.. లేదంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ తొక్కేస్తారు!
Virat Kohli Reaction on play more aggressively at 37. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Virat Kohli: 37 ఏళ్ల వయసులోనూ మారాల్సిందే.. లేదంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ తొక్కేస్తారు!
Virat Kohli: ఐపీఎల్ 2026 టైటిల్‌ను గెలుచుకుని వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న కోహ్లీ.. ఇప్పుడు రెండో టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన కెరీర్, జట్టు విజయం, యువ ఆటగాళ్ల ప్రభావంపై కింగ్ కోహ్లీ స్పందించాడు.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచే రోజు తానే విన్నింగ్స్ షాట్ కొట్టాలని ఎన్నోసార్లు ఊహించుకున్నానని విరాట్ కోహ్లీ తెలిపాడు. 'ఇది ప్రతి క్రికెటర్ కల. ట్రోఫీ గెలిచే సమయంలో నేను మైదానంలో ఉండి విన్నింగ్స్ షాట్ కొట్టాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ఈరోజు ఆ కల నిజమైంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం' అని కోహ్లీ భావోద్వేగం చెందాడు. యువ ఆటగాళ్ల ప్రభావంపై కూడా కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. అతని వంటి యువ ఆటగాళ్లు తన ఆటలో మార్పులు చేసుకునేలా ప్రేరేపించారని చెప్పాడు.
'ఈరోజు క్రికెట్ అవసరాలు మారిపోయాయి. చాలా చిన్న వయసు ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. వారు మిమ్మల్ని మరింత దూకుడుగా ఆడేలా, ఆటను మెరుగుపరుచుకునేలా ఒత్తిడి తెస్తారు. అందుకే నేను నా ఆట కంటే నా మైండ్‌సెట్‌ను మార్చుకున్నాను. బౌలర్లపై మరింత దాడి చేసి అదనపు పరుగులు సాధించాలని ప్రయత్నించాను. దూకుడుగా ఆదుకుంటే వెనకపడిపోతామని, కుర్రాళ్లు మా కంటే ముందువెలుతారు' అని వివరించాడు.
ఈ సీజన్‌లో తనపై మాత్రమే జట్టు ఆధారపడలేదని, అదే ఆర్సీబీ విజయానికి ప్రధాన కారణమని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'గతంలో చాలా సందర్భాల్లో జట్టు భారమంతా నా భుజాలపై ఉండేది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. మొదటి 10 మ్యాచ్‌ల్లోనే ఎనిమిది మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచారు. జట్టులో చాలా మందికి మ్యాచ్‌ను గెలిపించే సామర్థ్యం ఉంది. అదే మా బలం' అని చెప్పాడు. జట్టు బౌలర్ల ప్రదర్శనను కూడా కోహ్లీ ప్రశంసించాడు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలామ్ దార్ వంటి బౌలర్లు సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్ సరైన జట్టును నిర్మించడమే వరుస టైటిళ్లకు కారణమని అభిప్రాయపడ్డాడు.
ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవరన్నది తమకు పెద్దగా ముఖ్యం కాదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 'మా లక్ష్యం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం. ఆ తర్వాత ప్రత్యర్థి ఎవరో మేము పట్టించుకోలేదు. ఇతర జట్లను గౌరవిస్తాం కానీ.. మా దృష్టి పూర్తిగా మా ఆటపైనే ఉంటుంది. ఆర్సీబీకి మరో టైటిల్స్ అందించాలనే అందరం కష్టపడ్డాం. పెద్ద మ్యాచ్‌ల్లో అనుభవజ్ఞులే ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. ఈ ఫైనల్లో కూడా అదే జరిగింది. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మన వైపు తిప్పుకోవాలని నేను వెంకటేశ్ అయ్యర్కి చెప్పాను. మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. రన్‌రేట్ పెరగనివ్వకుండా చిన్న లక్ష్యాలతో ముందుకు వెళ్లాం. వెంకటేశ్ గత కొన్ని మ్యాచ్‌ల్లో చూపిన దూకుడు మా విజయానికి కీలకంగా మారింది' అని అన్నాడు.
ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. 'మాకు ఏడే హోమ్ మ్యాచ్‌లు ఉండవు. 14 హోమ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్లినా అభిమానులు మాతోనే ఉంటారు. ఫైనల్ గుజరాత్ హోమ్ గ్రౌండ్‌లో జరిగినా.. 90 శాతం మంది ఆర్సీబీ అభిమానులే కనిపించారు. ఎన్నేళ్లుగా మేము సంపాదించుకున్న ప్రేమ అది. వారి మద్దతు అమూల్యం. ఈ విజయాన్ని వారితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది' అని భావోద్వేగంగా చెప్పాడు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆర్సీబీ ప్రస్తుతం టోర్నీలో అత్యంత సమతుల్య జట్టుగా నిలిచింది.




