Virat Kohli: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. సుదీర్ఘ మౌనానికి తెరదించిన కోహ్లీ!
Virat Kohli: విరాట్ కోహ్లీ తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టాడు.
Virat Kohli: అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. సుదీర్ఘ మౌనానికి తెరదించిన కోహ్లీ!
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల అసలు కారణాన్ని ఎట్టకేలకు బయటపెట్టాడు. 2022 జనవరిలో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోగా.. అప్పట్లో కింగ్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఏడు సంవత్సరాల పాటు భారత టెస్టు జట్టును విజయవంతంగా నడిపించిన విరాట్.. 68 టెస్టుల్లో 40 విజయాలు అందించి అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయితే కెప్టెన్సీ తనను మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేసిందని తాజాగా వెల్లడించాడు.
ఆర్‌సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ నిర్వహించిన ‘ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’ మూడో ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. భారత క్రికెట్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో తాను పూర్తిగా ఆటలో మునిగిపోయానని చెప్పాడు. ‘భారత బ్యాటింగ్ యూనిట్‌కు, జట్టు నాయకత్వానికి నేనే కేంద్రబిందువుగా మారిపోయాను.
భారత క్రికెట్‌ను అగ్రస్థానంలో నిలపాలనే తపనతో నేను ఎంతగానో కష్టపడ్డా. కానీ ఆ రెండు బాధ్యతలు నా రోజువారీ జీవితంపై ఎంత ప్రభావం చూపాయో గ్రహించ లేకపోయాను. నేను కెప్టెన్సీ నుంచి తప్పుకునే నాటికి పూర్తిగా అలసిపోయాను. మానసికంగా కూడా మరింతగా అలసిపోయాను. అది చాలా కఠినమైన దశ. అంచనాలను అందుకోవడం చాలా కష్టం అయ్యింది. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా’ అని కోహ్లీ స్పష్టం చేశాడు.
తన కెప్టెన్సీ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు ఎలాంటి అసురక్షిత భావం రాకుండా చూడటమే ప్రధాన లక్ష్యమని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఈ విషయంలో అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ‘జట్టుకు ఎప్పుడూ నమ్మకంగా ఉండాలని కోరుకున్నా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి భయం, అస్థిరత ఉండకూడదనుకున్నా. అందుకు రవిశాస్త్రి, టీమ్ మేనేజ్‌మెంట్ చాలా సహకరించారు. కానీ ఒక దశ తర్వాత ఫామ్ పోయి కెప్టెన్సీ బాధ్యతలు మరింత భారంగా మారాయి. అప్పుడు పరిస్థితులు చాలా కఠినంగా అనిపించాయి’ అని కింగ్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తాను మానసికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని కూడా విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తనకు మళ్లీ క్రికెట్‌పై ప్రేమను కలిగించారని చెప్పాడు. ‘కెప్టెన్సీ వదిలిన తర్వాతనే నేను రాహుల్ భాయ్, విక్రమ్ రాథోడ్‌లతో ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించాను.
2023లో టెస్టు క్రికెట్‌లో నాకు మంచి సీజన్ అయింది. ఇప్పటికీ వారిని కలిసినప్పుడల్లా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతుంటాను. వాళ్లు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ల కోసం మళ్లీ ఆడాలని, బాగా ప్రదర్శన ఇవ్వాలని నాలో కోరిక కలిగించారు. మైదానంలోకి వెళ్లి మళ్లీ పోరాడాలని ప్రేరణ ఇచ్చారు. వారు చూపిన ప్రేమ, మద్దతు నాకు నేను ఇప్పటివరకు సాధించిన విషయాలను గుర్తు చేసింది’ అంటూ విరాట్ కోహ్లీ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.




