Virat Kohli: నాపై నమ్మకం లేకపోతే ముందే చెప్పండి.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ సూటి ప్రశ్న!

Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్‌లో తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Rishvik
Published on: 16 May 2026 6:10 PM IST
Virat Kohli
X

Virat Kohli: నాపై నమ్మకం లేకపోతే ముందే చెప్పండి.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ సూటి ప్రశ్న!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఐపీఎల్ 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పోడ్కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. తనను తాను ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

ఒకవేళ అలంటి పరిస్థితి వస్తే.. ఆ వాతావరణంలో తనకు ఉండాలనిపించదు అని స్పష్టం చేశాడు. ‘నేను సరిపోను అనుకుంటే ముందే చెప్పండి. ఎప్పటికప్పుడు నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో లేను. ఒత్తిడి చేస్తే ముందుకు సాగిపోతా' అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీసీసీఐ, సెలెక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ.. తర్వాత టెస్టు క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం కింగ్ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. వన్డే క్రికెట్‌కు ప్రస్తుతం అంతర్జాతీయ షెడ్యూల్‌లో తక్కువ ప్రాధాన్యం ఉండటంతో.. 37 ఏళ్ల కోహ్లీని 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగించాలా? లేదా? అన్న చర్చ బీసీసీఐలో జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కోహ్లీ తన భవిష్యత్తుపై స్పష్టత కావాలని బీసీసీఐకి నేరుగా సంకేతాలు ఇచ్చాడు.

తన ఫిట్‌నెస్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని కూడా విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ‘నేను ఇంకా 40 ఓవర్లు బౌండరీ నుంచి బౌండరీ వరకు పరుగులు తీయగలను. నా జీవనశైలి, ఫిట్‌నెస్ స్థాయి నాకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాయి’ అని చెప్పాడు. తనను జట్టులో నుంచి తప్పించాలనుకుంటే ఫిట్‌నెస్ లేదా వర్క్‌లోడ్ పేరుతో కాకుండా నేరుగా చెప్పాలని కోహ్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వన్డేల్లో కోహ్లీ 651 పరుగులు సాధించాడు. సగటు 65.1గా ఉండగా మూడు సెంచరీలు కూడా బాదాడు. ఈ ఏడాది కూడా ఇప్పటికే ఒక వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే.. కోహ్లీ ఇంకా అద్భుత బ్యాటర్‌గానే కొనసాగుతున్నాడు.

ఇటీవల కాలంలో బీసీసీఐ సెలెక్షన్ విధానం సీనియర్ ఆటగాళ్లను సిరీస్ టు సిరీస్ ఆధారంగా పరిశీలిస్తూ వస్తోంది. రోహిత్ శర్మ తర్వాత వన్డే కెప్టెన్సీపై కూడా బీసీసీఐ కొత్త ఆలోచనలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ మాత్రం 2027 వరల్డ్ కప్ వరకు తన పాత్రపై ముందుగానే పూర్తి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వరల్డ్ కప్‌లో తన అనుభవం, పెద్ద మ్యాచ్‌లలో ఆడే సామర్థ్యం భారత్‌కు ఉపయోగపడుతుందని కోహ్లీ భావిస్తున్నాడు.

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత బీసీసీఐ అధికారులతో కోహ్లీకి గతంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన కోహ్లీ.. మళ్లీ చిన్నపిల్లాడిలా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. క్రికెట్‌పై ప్రేమతోనే ఇంకా ఆడుతున్నానని వెల్లడించాడు. అయితే తన కెరీర్‌పై అనవసర సందేహాలు లేదా ఒత్తిడులు వస్తే.. తాను స్వయంగా తప్పుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విరాట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇక ఇప్పుడు నిర్ణయం పూర్తిగా బీసీసీఐ చేతుల్లోనే ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story