Virat Kohli: పరీక్షలకు హాజరుకానున్న కోహ్లీ.. అభిమానుల్లో భారీ ఆసక్తి!

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.

Rishvik
Published on: 19 Jun 2026 7:04 PM IST
Virat Kohli
X

Virat Kohli: పరీక్షలకు హాజరుకానున్న కోహ్లీ.. అభిమానుల్లో భారీ ఆసక్తి!

Virat Kohli: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2026 అనంతరం హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ పునరాగమనంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. అతని గాయం ఆశించిన దానికంటే వేగంగా నయం అవుతోందని సమాచారం. ఇప్పటికే రిహాబిలిటేషన్ ప్రారంభించిన కోహ్లీ.. త్వరలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకానున్నాడు. సీఓఈలో ఫిట్‌నెస్ టెస్టులు క్లియరెన్స్ లభిస్తే.. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కానున్నాడు. కోహ్లీ కోలుకునే ప్రక్రియ సానుకూలంగా సాగుతోందని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడుతాడని బీసీసీఐ వర్గాల సమాచారం.

ఇంగ్లండ్ పర్యటన కోసం భారత వన్డే జట్టును ఎంపిక చేసే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో మూడు, నాలుగు రోజుల్లో సమావేశం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై తుది నివేదిక అందిన తర్వాతే సెలెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ జూలై 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ సిరీస్ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల దృష్ట్యా భారత జట్టుకు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం భారత బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచుతుంది.

హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. గాయం తీవ్రత కారణంగా అతడు ఇంగ్లండ్ సిరీస్‌ను కూడా మిస్ కావచ్చనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉండటంతో కింగ్ త్వరలోనే మైదనంలోకి అడుగుపెట్టనున్నాడు. కోహ్లీ గైహాజరీలో యువ ఆటగాళ్లు అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ.. కింగ్ అనుభవం, నిలకడైన ప్రదర్శనలు జట్టుకు ఎంతో కీలకం.

ముఖ్యంగా కీలక సిరీస్‌లలో కోహ్లీ బ్యాటింగ్ భారత జట్టుకు అదనపు బలం. ప్రస్తుతం ఫామిలీతో కలిసి లండన్ లో ఉన్న కింగ్.. త్వరలో ఇండియాకు రానున్నాడు. కోహ్లీ పునరాగమనంపై వస్తున్న సానుకూల వార్తలు భారత అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఇంగ్లండ్ సిరీస్‌లో మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమవుతున్న కోహ్లీ.. మరోసారి తన క్లాస్‌ను చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story