Virat Kohli vs Rohit Sharma: విరాట్ కోహ్లీ 'ది ట్రోఫీ హంటర్'.. రోహిత్ శర్మ కంటే కింగ్ ఎందుకు ప్రత్యేకం?
Virat Kohli Trophy Hunter Mentality. ట్రోఫీల కోసం ఆకలితో ఆడుతున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలుస్తున్నాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Virat Kohli vs Rohit Sharma: విరాట్ కోహ్లీ 'ది ట్రోఫీ హంటర్'.. రోహిత్ శర్మ కంటే కింగ్ ఎందుకు ప్రత్యేకం?
Virat Kohli vs Rohit Sharma: ఐపీఎల్ 2026 ఫైనల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తాచాటి రెండో ఐపీఎల్ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అసాధారణ ప్రదర్శనతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 42 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేసి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న కోహ్లీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీకి అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 37 ఏళ్ల వయసులోనూ తన ఆటను నిరంతరం మెరుగుపరుచుకుంటూ.. ట్రోఫీల కోసం ఆకలితో ఆడుతున్న ఆటగాడిగా కోహ్లీ నిలుస్తున్నాడని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నిలకడలో కోహ్లీకి సాటి లేడు:
ఐపీఎల్ చరిత్రలో నిలకడకు మరో పేరు విరాట్ కోహ్లీ. 283 మ్యాచ్‌ల్లో 9,336 పరుగులు చేసిన కింగ్.. ప్రతి దశలో తన ఆటను కొత్తగా మలుచుకున్నాడు. ఐపీఎల్ 2026లో అతని స్ట్రైక్‌రేట్ 165.85కి చేరడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది విరాట్ అద్భుతమైన 2016 సీజన్ కంటే కూడా ఎక్కువ. మరోవైపు రోహిత్ శర్మ 7,329 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 5,439 పరుగులతో ఉన్నప్పటికీ.. నిలకడలో కోహ్లీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు.
‘చేజ్ మాస్టర్’ కోహ్లీ vs ‘హిట్‌మ్యాన్’ రోహిత్:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత క్రికెట్ దిగ్గజాలే. అయితే ఐపీఎల్‌లో భారీ స్కోర్లు, నిలకడ విషయానికి వస్తే.. కోహ్లీ ముందంజలో ఉన్నాడు. కోహ్లీ 68 సార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేయగా.. రోహిత్ 49 సార్లు మాత్రమే ఆ ఘనత సాధించాడు. కోహ్లీ ఖాతాలో 9 ఐపీఎల్ సెంచరీలు ఉండగా.. రోహిత్ రెండు శతకాలు మాత్రమే చేశాడు. ఇటీవలి సంవత్సరాల్లో కూడా కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా.. రోహిత్ కెరీర్‌లో గాయాలు, ఫామ్ సమస్యలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా 2017 తర్వాత రోహిత్ బ్యాటింగ్‌లో పస క్రమంగా తగ్గుతూ వచ్చింది.
2016లో పోటాపోటీగా రో-కో:
2016 సీజన్ రో-కో కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది. ఆ ఏడాది కోహ్లీ 973 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ వ్యక్తిగత సీజన్ నమోదు చేశాడు. నాలుగు సెంచరీలతో ఆర్సీబీని దాదాపు ఒంటిచేత్తో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రోహిత్ శర్మ కూడా 489 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాతి కాలంలో కోహ్లీ తన ఫామ్ నిలబెట్టుకోగలిగాడు. దాదాపు దశాబ్దం తర్వాత కూడా కింగ్ పరుగుల వరద కొనసాగుతుండడం విశేషం.
‘ట్రోఫీ హంటర్’గా మారిన కోహ్లీ:
గతంలో కోహ్లీ గురించి మాట్లాడితే పరుగులు, రికార్డులు, వ్యక్తిగత ప్రదర్శనలు ప్రధాన చర్చగా ఉండేవి. కానీ ఇప్పుడు అతని దృష్టి పూర్తిగా ట్రోఫీలపై ఉంది. 2025లో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత.. 2026లో మరోసారి కప్ గెలవడం ద్వారా తన ‘ట్రోఫీ హంటర్’ మెంటాలిటీని నిరూపించాడు. ఫైనల్లో అజేయంగా 75 పరుగులు చేసిన కోహ్లీ.. గతంలో కంటే ఎక్కువ దూకుడుతో ఆడాడు. మ్యాచ్‌ను ముగించే బాధ్యత తీసుకుని.. జట్టును విజయతీరాలకు చేర్చాడు.
రోహిత్ శర్మకు గడ్డు పరిస్థితులు:
2013 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం కూడా అతని నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కెప్టెన్సీ బాధ్యతలు వదిలిన తర్వాత అతని ప్రదర్శనను పూర్తిగా బ్యాటింగ్ ఆధారంగానే అంచనా వేస్తున్నారు. 2026 సీజన్‌లో గాయాల కారణంగా కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్.. 283 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ మెరుగుపడినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యలు అతని కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి.
ఫిట్‌నెస్‌లో కోహ్లీ ఆధిపత్యం:
విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాల్లో ఫిట్‌నెస్ అత్యంత ముఖ్యమైంది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత కూడా అతను లీగ్‌లో అత్యంత ఫిట్ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అదే అతనికి 37 ఏళ్ల వయసులోనూ 165కు పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడానికి సహకరిస్తోంది. రోహిత్ విషయంలో మాత్రం గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు తరచుగా చర్చకు వస్తున్నాయి. 2026 సీజన్‌లో కూడా అవే అతని ప్రదర్శనను ప్రభావితం చేశాయి. 2027 ప్రపంచ కప్ లక్ష్యంగా ఆడుతున్న ఈ ఇద్దరు.. మరో ఏడాది పాటు ఎలా ఆడుతారో.




